విజయదశమి.. అనాది కాలం నుంచి నేటి వరకు ఎందరికో విజయాలను ప్రసాదించిన రోజు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుడుతో యుద్ధం చేసిటప్పుడు శ్రీరాముడు విజయదశమి నాడే అపరాజితా దేవిని పూజించి, రావణుని సహరించాడు. ఇక ద్వాపర యుగంలో పాండవులు సైతం దసరా నాడు తమ అజ్ఞాత వాసం అయిపోయిన తర్వాత తమ ఆయుధాలను జమ్మిచెట్టు పై నుంచి తీసుకుని భారత యుద్ధానికి సిద్ధం అయ్యిన రోజు కూడా ఇదే. అదేవిధంగా దేవదానవుల పాల సముద్ర మదనంలో అమృతం లభించిందీ ఈ దశమినాడే. అలాంటి పవిత్రమైన.. చాలా శక్తివంతమైన ఈ రోజున ఏ పని ప్రారంభించినా తప్పక విజయం సాధిస్తారు. ఆశ్వయుజ శుక్ల దశమినాటి సాయం సంధ్యాసమయాన్నే విజయకాలం అంటాం. అది సర్వ కార్యసాధకమైన సమయం.
ఆ దశమీ దినం శ్రవణా నక్షత్రంతో కలిసి ఉండాలన్నది పెద్దల నిర్ణయం. ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రవణా నక్షత్రంతో కలసిన ఆశ్వయుజ దశమికి విజయా అనే సంకేతముంది. అందుకే దీనికివిజయదశమిఅనే పేరు వచ్చింది. విజయదశమి నాడు ఉదయాన్నే 5 గంటలకు లేచి శుచిగా తలస్నానం చేసి ఎర్రటి వస్ర్తాలు ధరించాలి. పూజామందిరం, ఇంటిని శుభ్రం చేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, రంగు రంగుల ముగ్గులు వేయాలి. రాజరాజేశ్వరి, దుర్గాదేవి ప్రతిమలను నల్లకలువలు, ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి. నైవేద్యానికి పొంగలి, పులిహోర తయారుచేయాలి. దీపారాధనకు 9వత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. అనంతరం పూజను ప్రారంభించి.. రాజరాజేశ్వరి అష్టకం, మహిషాసుర సంహారిణి అష్టకాన్ని పఠించాలి. వీలు కాకపోతే శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి.. కర్పూర హారతులు సమర్పించుకోవాలి.
విజయదశమి నాడు ఆలయాల్లో రాజరాజేశ్వరి అష్టోత్తర పూజ, లలితసహస్రనామం, కోటికుంకుమార్చన వంటి పూజలు చేయిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. ముత్తైదువులకు తాంబూలంతో పాటు రాజరాజేశ్వరి నిత్యపూజ, దేవిభక్తిమాల వంటి పుస్తకాలను ఇవ్వడం వల్ల దీర్ఘ సుమంగళీయోగం ప్రాప్తిస్తుందట.
విజయ ముహూర్తం:
మధ్యాహ్నం 1.57 నిమిషాల నుంచి 2.42 నిమిషాల వరకు సుమారు 44 నిమిషాల వ్యవధిలో ఉంది. అదేవిధంగా
అపరాజిత పూజను మధ్యాహ్నం 1.12 నుంచి 3.27 వరకు నిర్వహించాలి. మొత్తం కాలం 2 గంటల 15 నిమిషాలు. ఆయా ప్రాంతాల వారు అక్కడి సమయాలను అనుగుణంగా పైన చెప్పిన ముహూర్తాలలో ఏ పనినైనా ప్రారంభించినా తప్పక విజయం సాధిస్తారని శాస్త్రవచనం, పలువురికి అనుభవైక మంత్రం.
ఈ రోజు ఏ పనినైనా ప్రారంభించడానికి ముహూర్తం చూడనక్కర్లేదు. మంచి పనిని ఈ రోజు ప్రారంభించి అమ్మమీద భారం వేసి నిజాయతీతో శ్రమిస్తే తప్పక విజయం సొంతం అవుతుంది. కావాలంటే మీరు ప్రయత్నించి చూడండి. సకల కార్యసిద్ధికి మూలం. కాబట్టి ఆ ఆదిపరాశక్తిని విజయ మూహుర్తంలో,అపరాజిత పూజా సమయంలో ఆరాధించి పనిని మొదలుపెట్టాలి. దీనివల్ల దైవకృప శ్రీఘ్రంగా లభించి తలచిన కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది.
– కేశవ