ఏపీ బీజేపీ ఛీప్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత దగ్గుపాటి పురందేశ్వరి స్పీడ్ పెంచారు. అధికార వైసీపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పులకు.. కట్టిన ఇళ్లకు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ జేబులు నింపుకోడానికి ఏపీ పాలకులు పాకులాడుతున్నారని మండిపడ్డారు. చేసిన అప్పులు, కట్టిన ఇళ్ళపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం జారీ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం అనధికారికంగా రూ. 4.74 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆ భారాన్ని ప్రజలపై రుద్దుతోందని ఆమె ఆరోపించారు.
ఈ నేపథ్యంలో, పురందేశ్వరి వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీకి నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమ రాలేదంటూ గాలి మాటలెందుకు? అంటూ ఘాటుగా బదులిచ్చారు. పార్లమెంటులో ఆర్థికమంత్రి స్వయంగా ప్రకటించినా గానీ, చెల్లెమ్మ పురందేశ్వరి ఏవో కాకి లెక్కలు చెబుతోందని విమర్శించారు. “ఈ నాలుగేళ్లలో మీరు ఒక్కసారి కూడా రాష్ట్రానికి రాలేదన్నది వాస్తవం. బావ కళ్లలో ఆనందం కోసం కాదమ్మా… ప్రస్తుతం ఉన్న పార్టీ కోసం పనిచేయొచ్చు కదా!” అంటూ విజయసాయి వ్యాఖ్యానించారు.