ఎన్నో సంవత్సరాల కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈరోజు ఆయన వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని జీరా కాలనీలో లీజు ల్యాండ్ లో ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్న 134 ఇండ్ల స్థలాలను ఫ్రీ హోల్డ్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఓ కాపీని కాలనీ వాసులు కరతాళధ్వనుల మధ్య కాలనీ ప్రతినిధులకు మంత్రి అందించారు.
తమ సొంత ఇంటి కల.. కలగానే మిగిలిపోనున్నదా? అనే నైరాశ్యంతో ఉన్న తమకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారం, కృషితో కల నెరవేరిందని ప్రత్యేక అభినందనలను తెలిపారు. తమ సమస్యను అనేక సార్లు ముఖ్యమంత్రి, మున్సిపల్‌శాఖ మంత్రిల దృష్టికి తీసుకెళ్లి జీవో 816 ప్రకారం.. ఫ్రీ హోల్డ్ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయించారని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు వారు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జీరా కాలనీ అధ్యక్షుడు మాడపు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ యాదవ్, ఉపాధ్యక్షులు విజయ్ షా, కోశాధికారి రాజన్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.