ముస్లింలపై మూకదాడులకు పాల్పడుతున్నవారు హిందూత్వ వ్యతిరేకులని ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఇండియాలో ముస్లిం మత భద్రతకు ప్రమాదం లేదని, భారత గడ్డపై హిందూ-ముస్లిం తేడాల్లేవని..భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని మోహన్ భగవత్ అన్నారు. అయితే మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పందిస్తూ.. ముస్లిం సమాజంపై ద్వేషం అనేది హిందూత్వం నుంచే వచ్చిందని, తీవ్ర భావజాలమున్న కొందరి వల్ల ఇది వ్యాపిస్తోందని ట్వీట్ చేసారు. ముస్లింలపై మూకదాడులకు పాల్పడుతున్న నేరస్థులకు అధికార పార్టీ అండగా ఉంటోందని ఆరోపించారు.
మోహన్ భగవత్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్పందించిన తీరుపై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. అసదుద్దీన్ స్పందించిన తీరు చూస్తుంటే… రామ అన్న పదం కూడా కొంతమంది అవకాశవాదులకు బూతుగా వినిపిస్తుందనే సామెత నిజమయ్యిందేమో అన్న అనుమానం కలుగుతోందని అన్నారు. ముస్లింలపై మూకదాడులు హిందూత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకమని మోహన్ భగవత్ చెప్తే… అది కూడా అర్థం చేసుకోలేని స్థితిలో అసదుద్దీన్ ఓవైసీ ఉండటం చాలా విడ్డూరమని పేర్కొన్నారు.
ఎవరు ఏ మతంలో ఉన్నా, అందరూ భారతీయులమని మోహన్ భగవత్ దేశ సమైక్యతను చాటి చెప్పారని, కానీ ఈ మాటలు అసదుద్దీన్ దృష్టిలో నేరస్తులు చేసే వ్యాఖ్యలుగా కనిపించాయని విజయశాంతి పేర్కొన్నారు. తరచూ హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే ఎంఐఎం నేతల ప్రసంగాలను విని, ఆనందిస్తూ, అలవాటు పడిపోయిన అసదుద్దీన్‌కు.. భగవత్ అభిప్రాయం క్రిమినల్ ఆలోచన గానే కనిపిస్తుందని మండిపడ్డారు.
అయితే ఇప్పుడు మోహన్ భగవత్ వ్యాఖ్యలను తప్పు పడుతున్న అసదుద్దీన్, గతంలో తన సోదరుడు అక్బరుద్దీన్ హిందువులను ఉద్దేశించి చేసిన కామెంట్లను గుర్తు చేసుకోవాలని విజయశాంతి సూచించారు. అక్బరుద్దీన్ గతంలో ఓ సభలో మాట్లాడుతూ, ఐదు నిమిషాలు పోలీసులు గనుక విధులు నిర్వహించకుండా కళ్లు మూసుకుంటే, హిందువుల అంతు చూస్తానని, తన తడాఖా చూపిస్తానని విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగం చేసినప్పుడు అసదుద్దీన్ గారు ఎందుకు నోరు మెదపలేదు? అని ప్రశ్నించారు.ఇప్పుడు మోహన్ భగవత్ గారి మీద వచ్చిన పౌరుషం ఆరోజు ఏమైందో చెప్తే బాగుంటుందని మండిపడ్డారు.