రైతుల ఆగ్రహానికి.. టీఆర్ఎస్ దగ్ధం కావడం ఖాయం: విజయశాంతి

కెసిఆర్ సర్కార్ పై.. విజయశాంతి ఫైర్ అయ్యారు. రైతులకు కేంద్రం అన్యాయం చేస్తోందంటూ లేనిపోని అబద్ధాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కార్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వడ్ల రైతులకు బకాయిలు చెల్లించడంలో ఘోరంగా విఫలమై వారిని కన్నీటి పాలు చేస్తున్న తీరుపై గణాంకాలతో సహా మీడియాలో వచ్చిన కథనానికి జవాబు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని నిప్పులు చెరిగారు. ఇంతకు ముందు వడ్లు కొనుగోలు చేసి, రైతులకు వారం పది రోజుల్లోనే చెల్లించే పౌరసరఫరాల శాఖ ఇప్పుడు నెలలు గడుస్తున్నా చెల్లించక రైతుల్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల చుట్టూ తిప్పుకునే దుస్థితి నెలకొందన్నారు.

తెలంగాణలో అక్టోబరు చివరి వారంలో ధాన్యం కొనుగోళ్లు మొదలవగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఇప్పటివరకు 41.50 లక్షల టన్నులు కొనుగోలు చేసిందని… ఈ ధాన్యం విలువ రూ. 8,134 కోట్లు కాగా, ఇంత వరకు రూ.4,550 కోట్లు మాత్రమే అన్నదాతలకు చెల్లించారని పేర్కొన్నారు. రైతులకు రూ. 3,584 కోట్లు చెల్లించాల్సి ఉందని.. దాదాపు 6.60 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన సర్కారు ఇప్పటివరకు 2.50 లక్షల మంది రైతులకు మాత్రమే డబ్బులు చెల్లించిందని వెల్లడించారు. మరో 4.10 లక్షల మంది రైతులకు వడ్ల పైసలు అందలేదని… ఈ క్రమంలో రైస్ మిల్లర్లు కూడా అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చి, ఓపీఎమ్మెస్‌లో వివరాలు నమోదు చేస్తే తప్ప రైతులకు డబ్బులందే పరిస్థితి లేదని మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయని వెల్లడించారు.

ఈ మొత్తం పరిణామాలతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చడం ఆలస్యమై రైతులు ఆగమైతున్నరని… అన్నదాతల డబ్బు వారికివ్వడానికి నానా అగచాట్ల పాలు చేస్తున్న ధనిక రాష్ట్రాధిపతికి అసలు కేంద్రాన్ని నిందించే అర్హత ఉందా?… తక్షణం వడ్ల రైతులకు న్యాయం చెయ్యకపోతే వారి ఆగ్రహజ్వాలల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ దగ్ధం కాక తప్పదని హెచ్చరించారు.