అయ్యప్ప మాల ధారణ భక్తుల కోసం నవంబర్ 16 నుంచి శబరిమల ఆలయాన్ని తెరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే భక్తులకు ఆలయ బోర్డు పలు సూచనలు చేసింది. శబరిమలకు వెళ్లేవారు 24 గంటల ముందు తీసుకున్న కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండాలి. దేవస్థానం బోర్డు వెబ్‌సైట్‌లో వర్చువల్ క్యూలో రిజిస్టర్ చేసుకోవాలి. అన్నీ పక్కాగా తీసుకున్నాకే దర్శనానికి అనుమతిస్తారు.
కేరళలోని నిలకల్ బేస్ క్యాంప్ వద్దకు చేరుకునే భక్తులు అంతకు 24 గంటల ముందు తీసుకున్న కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. అలాగే నిలకల్, పంపా ప్రాంతాల్లో భక్తులకు మళ్లీ టెస్టులు చేస్తారు. ఎలాంటి లక్షణాలు లేని వారిని, కోవిడ్ నెగెటివ్ వచ్చిన వారినే ముందుకు అనుమతిస్తారు. లేదంటే అక్కడి నుంచి భక్తులు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది.
ఇక ఆలయం ప్రారంభంలో మొదటి 5 రోజుల పాటు రోజుకు 1000 మంది భక్తులనే దర్శనానికి అనుమతిస్తారు. శని, ఆదివారాల్లో 2వేల మంది దర్శనం చేసుకోవచ్చు. ఆ తరువాత మండల పూజ, మకరవిలక్కు రోజుల్లో రోజుకు 5వేల మందికి దర్శనానికి అనమతిస్తారు. ఈ మేరకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్.వాసు మీడియాకు వివరాలను వెల్లడించారు.
శబరిమల దర్శనానికి వచ్చే భక్తులు కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. కోవిడ్ జాగ్రత్తలు అనుసరించాలి. మాస్కులు, గ్లోవ్స్ విధిగా ధరించాలి. సామాజిక దూరం పాటించాలి. నిలకల్, పంప నడుమ రాకపోకలకు తేలికపాటి వాహనాలను (కార్లు వంటివి) మాత్రమే అనుమతిస్తారు. పంపా నదిలో స్నానం చేయడాన్ని నిషేధించారు. అందుకు బదులుగా నది వద్ద షవర్లను ఏర్పాటు చేశారు. అన్నదానం, సన్నిధానాల్లో ఆహార పదార్థాలకు, ప్రసాదాలకు పేపర్ ప్లేట్లను వాడుతారు. నీళ్ల కోసం రూ.100 డిపాజిట్ చేస్తే స్టీల్ వాటర్ బాటిల్స్ ఇస్తారు. బాటిల్ రిటర్న్ ఇస్తే రూ.100 తిరిగి పొందవచ్చు.
ఇక ఆలయ సమీపంలో ట్రెక్కింగ్ కు అనుమతిచ్చారు. స్వామి అయ్యప్పన్ రోడ్డులో మాత్రమే అందుకు అనుమతి ఉంది. ఆలయానికి వెళ్లే అన్ని మార్గాల్లోనూ భక్తుల సౌకర్యార్థం మెడికల్ సెంటర్లు, ఆక్సిజన్ పార్లర్లను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు స్వామి అభిషేకం కోసం తీసుకెళ్లే కొబ్బరికాయలు, నెయ్యిని ప్రత్యేక కౌంటర్ల ద్వారా తీసుకుంటారు. పూజలు చేసిన అనంతరం వాటిని అవే కౌంటర్ల ద్వారా భక్తులకు తిరిగి ఇస్తారు.
మండల పూజ డిసెంబర్ 26న ఉంటుంది. డిసెంబర్ 27న ఆలయాన్ని మూసివేస్తారు. డిసెంబర్ 30న మళ్లీ ఆలయాన్ని తెరుస్తారు. జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. జనవరి 20న మళ్లీ ఆలయాన్ని మూసివేస్తారు.