నందమూరి బాలకృష్ణ. నటుడుగానేకాదు.. హిందూపురం ఎమ్మెల్యేగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అయితే, సినిమాల్లో ఎక్కువగా దృష్టి పెట్టడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో సమయం కేటాయించలేక పోతున్నారు. వరుస విజయాలు సాధించిన హిందూపురంపై కూడా పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు అయితే, ఆయన అడుగులు వేస్తే మాత్రం ఖచ్చితంగా పాలిటిక్స్‌లో సెంటరాఫ్‌ది టాక్‌గా నిలుస్తారనడంలో సందేహం లేదు. ఇక, ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. ఆయన ఇద్దరు అల్లుళ్ల కోసం రాజకీయాల్లో ఎక్కువ సమయమే కేటాయించాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు పరిశీలకులు.
బాలయ్య ఇద్దరు అల్లుళ్లు రాజకీయాల్లో ఉన్నారు. ఒక అల్లుడు నారా లోకేష్.. టీడీపీకి కాబోయే అధ్యక్షుడిగా కూడా ప్రచారంలో ఉంది. మరో అల్లుడు.. గీతం విద్యాసంస్థల సీఈవో.. మతుకుమిల్లి భరత్.. కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. గత ఏడాది ఎన్నికల్లో విశాఖ ఎంపీగా టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఇక, నారా లోకేష్ కూడా గత ఏడాది ఎన్నికల్లో మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఈ ఇద్దరికీ వచ్చే ఎన్నికలు చాలా ముఖ్యంగా మారనున్నాయి. ఇద్దరి గెలుపు ఖచ్చితంగా పార్టీపై ప్రభావం చూపిస్తాయి.
లోకేష్‌ను భవిష్యత్ టీడీపీ అధ్యక్షుడిగానే కాకుండా… ఏపీ సీఎంగా కూడా చేస్తారన్న అంచనాలు ఉన్నాయి. అటు చంద్రబాబే కాదు ఇటు బాలయ్య కూడా లోకేష్ పొలిటికల్ ఫ్యూచర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అటు భరత్‌ను కూడా ఈ సారి గట్టెక్కించకపోతే ఇక రాజకీయ భవిష్యత్‌పై ఆశలు వదులు కోవాల్సిందే. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ ఈ ఇద్దరి అల్లుళ్ల విషయంలో తనదైన వ్యూహాలు పన్నాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం.
గత ఎన్నికల్లో జగన్ సునామీ భారీ ఎత్తున ఉన్నప్పటికీ.. నందమూరి బాలయ్య హిందూపురంలో గెలుపు గుర్రం ఎక్కారు. అంటే.. ఆయన ఇమేజ్ ఆయనకు చాలా వరకు ప్లస్ అయింది. సో.. ఇప్పుడు ఆయన తన ఇద్దరు అల్లుళ్ల కోసం రంగంలోకి .. వారిని గెలిపించుకునేందుకు ప్రయత్నాల్సిన అవసరం ఉందని అంటున్నారు. వాస్తవానికి మంగళగిరిలోను, విశాఖలోనూ కూడా బాలయ్య గత ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. అయితే ఈ సారి ఎన్నికలొచ్చినప్పుడు ప్రచారం మాత్రమే కాకుండా ఇప్పటి నుంచే వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లి ఎన్నికల వేళ బాలయ్య వచ్చి చేతులు ఊపితే ఓట్లు రాలే పరిస్థితి లేదు. ఇప్పటి నుంచే నిరంతరం ప్రజల్లో ఉంటేనే ఈ సారి టీడీపీకి అయినా, బాలయ్య అల్లుళ్లకు అయినా ఫ్యూచర్ ఉండే పరిస్థితి కనిపిస్తోంది. మరి బాలయ్య ఇప్పటకీ అయినా ప్రజల్లో ఉంటూ రియల్ హీరో అవుతారో ? లేదా సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ రీల్ హీరోగా మిగిలిపోతారో ? చూడాలి.