డబ్బులు పొదుపు చేసుకునేందుకు మనకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ స్కీంలు కూడా ఉన్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు డబ్బును పొదుపు చేసుకునేందుకు పోస్టాఫీస్ అనేక పథకాలను అందిస్తోంది. ఏ పథకంలో అయినా మనకు బ్యాంకుల కన్నా ఎక్కువగానే వడ్డీని చెల్లిస్తారు. ఇక పెట్టిన డబ్బులకు రెట్టింపు మొత్తంలో సొమ్ము రావాలంటే అందుకు పోస్టాఫీస్ కిసాన్ వికాస పత్ర స్కీం ఎంతగానో ఉపయోగపడుతుంది.
పోస్టాఫీస్ అందిస్తున్న కిసాన్ వికాస్ పత్ర స్కీంలో పెట్టుబడి పెడితే డబ్బు రెట్టింపు అవుతుంది. అంటే ఉదాహరణకు మీరు రూ.1 లక్ష పెడితే అది నిర్ణీత సమయంలో రెట్టింపు అవుతుందన్నమాట. ఈ క్రమంలో మీకు రూ.2 లక్షలు చెల్లిస్తారు. రూ.1 లక్షకు ఇంకో రూ.1 లక్ష వండీ కింద చెల్లిస్తారు. ఇలా ఎంత మొత్తం పొదుపు చేసిన అంతకు రెట్టింపు మొత్తంలో చివర్లో డబ్బును పొందవచ్చు.
ఈ స్కీంలో సింగిల్ లేదా జాయింట్ అకౌంట్లను ఓపెన్ చేయవచ్చు. 18 సంవత్సరాలు నిండినవారు కనీసం రూ.1వేయితో ఈ స్కీంలో డబ్బులు పొదుపు చేయవచ్చు. రూ.1000, రూ.5వేలు, రూ.10వేలు, రూ.1 లక్ష ఇలా పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టిన మొత్తాలకు పత్రాలను మంజూరు చేస్తారు. ఇక ఆ మొత్తం లాక్ అవుతుంది. 124 నెలల తరువాత స్కీం మెచూర్ అవుతుంది. దీంతో మనకు రెట్టింపు మొత్తంలో డబ్బు అందుతుంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ స్కీం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా ఏడాదికి 6.9 శాతం వడ్డీని చెల్లిస్తారు. ఎక్కువ కాలం పాటు ఆగుతాం అనుకుంటే ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు.