కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? కారును కొత్త సంవత్సరంలో కొనాలని అనుకుంటున్నారా ? అయితే ఆగండి. ఆ నిర్ణయాన్ని అప్పటి వరకు వాయిదా వేయకండి. ఇప్పుడే కారు కొనేయండి. డిసెంబర్ 31వ తేదీ లోపు కారును కొనుక్కోండి. ఎందుకంటే కార్ల ధరలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్నాయి. అవును నిజమే.
వచ్చే ఏడాది జనవరి మొదటి వారం నుంచే కార్ల ధరలను పెంచాలని దాదాపుగా అన్ని కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే మారుతి సుజుకి, హుండాయ్, కియా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రెనాల్ట్, హోండా, నిస్సాన్ ఇండియా తదితర కంపెనీలు జనవరిలో కార్ల ధరలను పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. అందువల్ల కొత్త కార్లను కొనాలని అనుకునే వారు డిసెంబర్ 31వ తేదీ లోపే కార్‌ను కొనుగోలు చేయడం ఉత్తమం.
నిత్యం పెరుగుతున్న విడి భాగాల ధరలు, ఇతర ఖర్చుల వల్లే కార్ల ధరలను పెంచాల్సి వస్తుందని ఆ కంపెనీ తెలిపాయి. అందులో భాగంగానే నిస్సాన్ కార్ల ధరలు ఏకంగా 5 శాతం పెరగనున్నాయి. అలాగే ఇతర కంపెనీలు కూడా 3 నుంచి 6 శాతం మధ్య ధరలను పెంచాలని చూస్తున్నాయి. అయితే ఏప్రిల్ నుంచి నవంబర్ నెల వరకు కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. దీంతో ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ధరలను పెంచితే కార్ల అమ్మకాలు అసలు జరుగుతాయా అని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి నుంచి మార్చి వరకు కీలక సమయమని వారు అంటున్నారు.