ఏపీలో రాజకీయ పార్టీల వైరం ప్రభుత్వ ఉద్యోగుల పై మళ్లినట్లుంది.నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎమ్మెల్యే నుంచి అలాంటి పరిస్థితే సబ్ కలెక్టర్ కి ఎదురైంది. జిల్లా అధికార యాంత్రంగం పై ఫైరయిన వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మీరుంటే నేను స్టేజీ మీదకు రాను అంటూ అధికారుల మొహం మీదే చెప్పేశారు.ఇప్పటికే మంత్రి అనిల్ ఆనం మధ్య నడుస్తున్న వార్ ఈ సంఘటనతో కొత్త టర్న్ తీసుకున్నట్లైంది.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ మధ్య సంవాదం నడిచింది. సభ ప్రారంభం కాగానే ఎమ్మెల్యే రామనారాయణరెడ్డిని, సబ్ కలెక్టర్ వేదికపైకి ఆహ్వానించారు. అయితే ఆనం స్పందిస్తూ కలెక్టర్ ఆదేశాల మేరకు మీరు సభ నిర్వహించుకోండి, తాము, పార్టీనేతలంతా కిందే ఉంటామని బదులిచ్చారు. అయినా సబ్ కలెక్టర్ మరోసారి వేదికపైకి రావాలని కోరారు. మళ్లీ స్పందించిన ఆనం ఇళ్ల పట్టాల కార్యక్రమం తన చేతుల మీదుగా జరగాలని, ప్రభుత్వ అధికారిగా ప్రజలకు సీఎం సందేశాన్ని వినిపించి వెళ్లండన్నారు.
అంతటితో ఆగకుండా మీరు వేదికపై ఉంటే రానని, తాను వస్తే మీరు వేదికపై ఉండటానికి వీల్లేదని రామనారాయణరెడ్డి తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలతో నొచ్చుకున్న సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ చేసేదేమీ లేక సభను కొనసాగించాల్సిందిగా అధికారులకు సూచించి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, గూడురు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది.
ఇటీవల వెంకటగిరిలో జాతర నిర్వాహణకు సబ్ కలెక్టర్ కోవిడ్ ఆంక్షలతో అనుమతించకపోవడంతో తొలుత ఇద్దరి మధ్య అంతరం పెరిగింది. ఆ తర్వాత డెక్కలి మండంలోని ఓ ట్రస్టు కార్యకలాపాలు, అంగన్ వాడీ పోస్టుల భర్తీలోనూ ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి. ఇప్పుడు ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో తాజా సంవాదం చర్చనీయాంశమైంది.