చేతులెత్తేసిన బాబు ? రాబిన్ శర్మ పైనే టీడీపీ భారం ?

-

పార్టీ నాయకుల్లో ఉత్సాహం తెచ్చేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా, పదవులు ఇస్తున్నా, ఎంతగా యాక్టివ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా, టీడీపీ శ్రేణుల్లో ఇంకా నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. దీనికి తగ్గట్టుగానే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఏపీ లో కంటే ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితం అవుతుండడం, చుట్టపు చూపుగా రాజకీయాలలో పాల్గొంటూ.. ఎక్కువగా సోషల్ మీడియాకే పరిమితమైపోవడం వంటివి టిడిపి శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు కలిగిస్తున్నాయి. అప్పుడప్పుడు మాత్రమే బాబు దర్శనం ఏపీ నేతలకు లభిస్తోంది. ఇక ముందు ముందు కూడా ఇదే పరిస్థితి ఉండటం వంటి కారణాలతో టిడిపి రాజకీయ భవిష్యత్తుపై అందరికీ ఆందోళన నెలకొన్నాయి. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో టీడీపీ అధికారం దక్కించుకునే స్థాయికి వెళ్లాలంటే తాను పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచేందుకు చంద్రబాబు రాబిన్ శర్మ అనే ఒక రాజకీయ వ్యూహ కర్తను టిడిపికి నియమించారు.

ఈ రాబిన్ శర్మ మరెవరో కాదు ప్రశాంత్ కిషోర్ టీమ్ లో ఒకప్పుడు కీలక వ్యక్తి. గతంలో వైసీపీ తరఫున పని చేసిన సమయంలో ఆయనే యాక్టివ్ గా ఉండేవారు. వైసిపి పై పూర్తిస్థాయిలో అవగాహన ఉండడం, పూర్తిగా వైసీపీ లొసుగులు, వ్యూహాలు తెలిసిన వ్యక్తి కావడం వంటి కారణాలతో ఆయననే ఏరికోరి మరీ నియమించుకున్నారు. ప్రస్తుతం తిరుపతి లోక్ సభ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. బిజెపి, జనసేన, వైసీపీ ఇలా అన్ని పార్టీలు తమ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టి విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. టిడిపికి ఇక్కడ పెద్దగా బలం లేకపోవడం, గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేకపోవడం వంటి కారణాలతో తిరుపతి పై టిడిపి ఎప్పుడో అసలు వదిలేసుకుంది. అయితే ఇక్కడ పోటీ చేసి గెలవకపోతే టిడిపి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందనే విషయం బాగా తెలుసు కాబట్టే తిరుపతి ఎన్నికలపై దృష్టి పెట్టి హడావుడి చేస్తోంది.

అందుకే రాబిన్ శర్మను ఇక్క రంగంలోకి దించింది. ఇప్పటికే రాబిన్ శర్మ తిరుపతిలో మకాం వేసి మరీ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. తన టీమ్ తో కలిసి తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో టిడిపి బలాబలాలను అంచనా వేస్తూ, వైసిపి లొసుగులను పసిగట్టే పనిలో ఉన్నారు. అలాగే వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రత్యేకంగా సోషల్ మీడియా టీమ్ లను యాక్టివ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. బూత్, మండల, అసెంబ్లీ పార్లమెంట్ స్థాయిలో ప్రత్యేక కమిటీలను నియమించి, టీడీపీకి బలం పెంచే రాజకీయ వ్యూహాలను అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేక టీమ్ లను కూడా ఆయన రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

రానున్న రోజుల్లో చంద్రబాబు యాక్టివ్ గా ఉండే పరిస్థితి లేకపోవడం, రాజకీయ వ్యూహాలు పన్నడం లో లోకేష్ ఇంకా అనుభవం సంపాదించుకోకపోవడం వంటి కారణాలతోనూ ముందు ముందు కూడా రాబిన్ శర్మ సేవలను వినియోగించుకుని…  ఆయన ద్వారానే రాజకీయంగా గట్టెక్కాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టుగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news