విదేశాల్లో మగ్గుతున్న నల్లధనంతోపాటు స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్ల ధనాన్ని వెలికి తీస్తామని, అవినీతి పరుల భరతం పడతామని మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సార్లు చెప్పింది. అందులో భాగంగానే మోదీ అప్పట్లో పెద్ద నోట్లను రద్దు కూడా చేశారు. అయితే విదేశాల్లో ఎంత నల్లధనం ఉందో చెప్పలేమని, ఆ విషయమై అధికారిక వివరాలు కూడా లేవని సోమవారం పార్లమెంట్‌లో కేంద్రం తెలిపింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ విన్సెంట్ హెచ్ పాలా పార్లమెంట్‌లో నల్లధనం విషయమై ప్రశ్నలు వేశారు. గత 10 ఏళ్లలో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనం మొత్తం ఎంతో చెప్పాలని కోరారు. అలాగే విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఈ విషయమై ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్టు చేశారు, ఎంత మందిపై చార్జిషీట్ నమోదు చేశారు, ఎంత మంది నుంచి భారత్‌కు నల్ల ధనం వెనక్కి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ? వంటి ప్రశ్నలు వేశారు.
కాగా ఆ ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానాలు ఇచ్చారు. గత 10 ఏళ్లలో భారతీయులు స్విస్ బ్యాంకుల్లో ఎంత నల్లధనం దాచారో తెలియదని, దానిపై అధికారిక వివరాలు ఏవీ లేవని, అందువల్ల ఆ వివరాలను చెప్పలేమన్నారు. అయితే నల్లధనాన్ని వెనక్కి రప్పించడంలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
2017 జూలై 1 నుంచి పన్ను చట్టం 2015 ప్రకారం ది బ్లాక్ మనీ కార్యక్రమం చేపట్టామని అందులో భాగంగానే చాలా వరకు విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి రప్పించామని తెలిపారు. ఇందుకు ఓ స్పెసల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలోనే బ్లాక్ మనీ యాక్ట్ ప్రకారం 107 ఫిర్యాదులను నమోదు చేసినట్లు తెలిపారు. వాటిల్లో భాగంగా ఇప్పటికే రూ.8216 కోట్ల నల్ల ధనాన్ని రికవరీ చేశామన్నారు. ఇది కాకుండా హెచ్ఎస్‌బీసీ కేసులో రూ.1294 కోట్ల జరిమానా విధించామని, ఐసీఐజే కేసులో రూ.11,010 కోట్ల నల్ల ధనాన్ని గుర్తించామని, పనామా పేపర్స్ కేసులో మరో రూ.20,078 కోట్లను గుర్తించామని, పారడైజ్ పేపర్స్ లీక్ కేసులో లెక్కకు రాని రూ.246 కోట్ల ధనాన్ని గుర్తించామని తెలిపారు.