అమరావతి: నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు నిదానంగా ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్‌లో ప్రవేశించడానికి వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవని పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో ఏపీ మీదుగా పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి.
కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం ప్రకటించింది. ఉత్తర కోస్తాలో గురువారం ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. ఇదే సమయంలో సముద్రం నుంచి తేమగాలులు వీచాయి. ఈ రెండింటి ప్రభావంతో వాతావరణంలో అనిశ్చితి నెలకొని గురువారం సాయంత్రం పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం పడింది. కోస్తాలోని పలు ప్రాంతాలు, రాయలసీమలో చాలా చోట్ల మేఘాలు ఆవరించినా పొడి వాతావరణం కొనసాగింది. ఇవాళ, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.