మరో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షాలు

ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ గురువారం నాటికి దాదాపు దక్షిణకోస్తా – ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.

దీని ప్రభావంతో బుధవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గురువారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలినచోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ గరిష్ఠంగా 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ సూచించారు. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదన్నారు. భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టుప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.