అయ్యో! పార్టీ మారినా పదవి దక్కలేదే

-

ఆ ముగ్గురు నాయకులు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఉన్నత పదవులు సైతం నిర్వర్తించారు. ఎంతో మందికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చారు. కానీ, పరిస్థితి మారింది. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కనుమరుగైంది. ఆ ముగ్గురు నేతల పరిస్థితి సైతం తలకిందులైంది. రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరమైంది. చివరికి గులాబీ కండువా కప్పుకున్నారు. చివరి వరకు ఎమ్మెల్సీ పదవి వరిస్తుందని ఆశించారు. కానీ, ఆశాభంగమే మిగిలింది. ఇప్పుడు రాష్ట్రంలో ఆ ముగ్గురు నేతలు హాట్‌టాపిక్‌గా మారారు. వారే ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, ఈ.పెద్దిరెడ్డిలు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలుగు దేశం పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించారు చంద్రబాబు. తెలంగాణకు ఎల్.రమణను అధ్యక్షుడిగా నియమించారు. 2015-2021 వరకు ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. కానీ, హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఆయనకు ఎమ్మెల్సీ ఖరారు అని ప్రచారం జరిగింది. అంచనాలకు అందకుండా కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటారు. అందులో భాగంగానే ఎల్ రమణకు మొండి చెయ్యి మిగిలింది. అటు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వదులుకొని వచ్చినా పదవి దక్కకపోవడంపై పలువురు నిట్టుర్చుతున్నారు.

ఇనుగుల పెద్దిరెడ్డి. చంద్రబాబునాయుడు హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత. మంత్రి పదవి కూడా నిర్వర్తించారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన నేత. ఉప ఎన్నికల వరకు బీజేపీలో కొనసాగారు. ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కమలం కండువా కప్పుకోవడంతో ఆయన అలక బూనారు. పార్టీ ఫిరాయించారు. ఎన్నికలకు ముందు గులాబీ కండువా కప్పుకున్నారు. అయిన కూడా ఎమ్మెల్సీ పదవి ఆశించిన వారిలో ముందున్నారు. కానీ, ఆశా నిరాశ అయింది.

టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీ ఆశించి భంగపడ్డ మరో కీలక నేత మోత్కుపల్లి నర్సింహులు. చంద్రబాబునాయుడు హయాంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి పదవి కూడా నిర్వర్తించారు. సీఎం కేసీఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన కమలం పార్టీలో చేరిపోయారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్ దళిత బంధు ప్రకటించడంతోనే మోత్కుపల్లి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. బీజేపీపై తీవ్ర విమర్శలతో సీఎం కేసీఆర్ ఆకట్టకునే ప్రయత్నం చేశారు. కానీ, ఆయనకు కూడా పదవి దక్కలేదు. బీజేపీలో చేరి గవర్నర్ పదవి ఆశించి భంగపడ్డారు. టీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ వస్తుందనుకున్నా దక్కలేదు.

ఎవరికీ ఊహించని విధంగా ఎత్తుగడలు వేయడం కేసీఆర్‌కే చెల్లు. ఆ ఎత్తుగడలో ఎంతో మంది నేతలు అందలం ఎక్కారు. మరికొంత మంది అధ: పాతాలంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వెంకట్రామిరెడ్డి వంటి బ్యూరోక్రాట్‌కు ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. గవర్నర్ కోటాలో తిరస్కరణకు గురైన పాడి కౌశిక్‌రెడ్డి సైతం ప్రమోషన్ లభించింది. కానీ, ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, ఈ.పెద్దిరెడ్డిలు మాత్రం నిట్టూర్పే మిగిలింది.

 

 

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news