ఇక భాజపాని సాగనంపాలి…

-

దేశం భవిష్యత్ బాగుండాలంటే భాజపాని ఇక సాగనంపాల్సిందే అంటూ కోల్ కత్తా వేదికగా భాజపా వ్యతిరేక కూటమి ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు మాట్లాడుతూ… సామాజిక న్యాయం, లౌకిక వాద పరిరక్షణ ఆధారంగా అభివృద్ధి చెందిన భారతీయ వ్యవస్థను నరేంద్రమోడీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని పేర్కొన్నారు. మోడీ, షాల కారణంగా నాశనమవుతున్న ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని అన్నారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ…ప్రధాని ఎవరన్న విషయం తామిప్పుడు ఆలోచించడం లేదని, భాజపాను  సాగనంపడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యమని చెప్పారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దేశ ప్రజలను నరేంద్రమోడీ మోసగించారని అన్నారు. భాజపా మతం పేరుతో ప్రజలను విభజిస్తోందని, విద్వేషాలు పురికొల్పుతోందని విమర్శించారు.

కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, సమాజ్‌ వాద్‌ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, డిఎంకె అధినేత స్టాలిన్‌, మాజీ ప్రధాని దేవగౌడ, కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరి, శత్రుఘ్న సిన్హా, వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, జయంత్‌ చౌదరి, జెఎంఎంఎ నేత హేమంత్‌ సోరెన్‌, పటీదార్‌ ఉద్యమనేత హార్ధిక్‌ పటేల్‌,  గెగాంగ్‌ అపాంగ్‌ తదితరులు ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్‌, ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌, ఆర్‌ఎల్‌డికి చెందిన అజిత్‌ సింగ్‌ఎల్‌జెడి నేత శరద్‌ యాదవ్‌, జార్ఖండ్‌ వికాస్‌ మోర్చాకు చెందిన బాబులాల్‌ మరాండి, దళిత నేత జిగేష్‌ మేవాని తదితరులు పాల్గొన్నారు. కొన్ని అనివార్య అత్యవసర కార్యక్రమాల వల్ల తాను ఈ ర్యాలీలో పాల్గొనలేకపోతున్నానంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version