ఫేజ్‌ 1, 2 క్లినికల్‌ ట్రయల్స్‌ అంటే ఏమిటి ? తరువాత ఏం జరుగుతుంది ?

-

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు గాను ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫార్మా కంపెనీలు, సైంటిస్టులు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. అందులో భాగంగానే అనేక కంపెనీలు ఇప్పటికే ఫేజ్‌ 1, 2 హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ దశలోకి ప్రవేశించాయి. ఇక భారత్‌కు చెందిన ఫార్మా దిగ్గజ కంపెనీ భారత్‌ బయోటెక్‌ కూడా కోవిడ్‌కు కోవాక్సిన్‌ పేరిట ఓ వ్యాక్సిన్‌ను ఇప్పటికే తయారు చేసి దానికి ఫేజ్‌ 1, 2 హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. అయితే ఇంతకీ ఫేజ్‌ 1, 2 ట్రయల్స్‌ అంటే ఏమిటి ? అవి ముగిశాక ఏం జరుగుతుంది ? అంటే…

ఫేజ్‌ 1 హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో మెడిసిన్‌ను ఏ వయస్సు వారికి ఎంత మోతాదులో ఎప్పుడు ఇవ్వాలి అనేది నిర్ణయిస్తారు. దాని ప్రకారం చాలా తక్కువ మందిని క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఎంచుకుంటారు. వారికి మెడిసిన్‌ను ఇచ్చి కొన్ని రోజుల పాటు వారికి ఏమైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయా, ఎంత డోస్‌ తీసుకున్న వారికి మెడిసిన్‌ ఎలా పనిచేస్తుంది, ఫలితం ఎలా ఉంది.. అన్న వివరాలను పరిశీలిస్తారు. ఈ దశలో సక్సెస్‌ అయితే ఫేజ్‌ 2కు వెళ్తారు.

ఫేజ్‌ 2లో నిర్దేశించిన డోసులను పెద్ద మొత్తంలో మనుషులకు ఇస్తారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో మెడిసిన్‌ను పరీక్షిస్తారు. అందుకు ఎక్కువ మంది వాలంటీర్ల సహాయం తీసుకుంటారు. అందరికీ భిన్న రకాల డోసుల్లో, నిర్దిష్టమైన సమయాల్లో మెడిసిన్‌ను ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ దశలో కూడా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయా, మెడిసిన్‌ పనితీరు ఎలా ఉంది, డోసేజ్‌ మార్చాలా.. అన్న వివరాలను పరిశీలిస్తారు. ఇక ఈ దశ సక్సెస్‌ అయితే ఫేజ్‌ 3కి వెళ్తారు.

what are phase 1 and 2 clinical trials what happens next

ఫేజ్‌ 3 లో మరింత ఎక్కువ మందికి పరీక్షలు చేస్తారు. ఇంకా ఎక్కువ రోజుల సమయం తీసుకుని మెడిసిన్‌ ఫైనల్‌ డోసేజ్‌ను నిర్ణయిస్తారు. దాంతో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయో పూర్తిగా వివరాలను సేకరించి పత్రాలను ప్రచురిస్తారు. ఈ దశ దాటితే మెడిసిన్‌ను సాధారణ జనాల కోసం ఉపయోగించవచ్చు. ఈ దశ దాటి సరికే ఫార్మా కంపెనీలు తమ మెడిసిన్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి అప్పటికే ప్రజల కోసం సిద్ధంగా ఉంచుతాయి.

ఇక పైన తెలిపిన ఏ దశలో అయినా.. మెడిసిన్‌ ఆశించిన మేర ఫలితాలు ఇవ్వక ట్రయల్స్‌ ఫెయిలైతే తిరిగి మొదటి దశ నుంచి మళ్లీ పరీక్షలు నిర్వహించాలి. అయితే ఒక్కసారి ఫేజ్‌ 3 దాటి మెడిసిన్‌ బయటకు వస్తే.. దానిపై మళ్లీ ఫేజ్‌ 4 దశలో పరీక్షలు ఉంటాయి. ఇవి కొన్నేళ్లపాటు జరుగుతాయి. దీంతో మెడిసిన్లను ఎక్కువ కాలం పాటు వాడడం వల్ల జనాల్లో ఇతర ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తున్నాయా, లేదా.. అన్న వివరాలను పరిశీలిస్తారు. అంతా బాగుంటే ఓకే.. లేదంటే మెడిసిన్‌ అమ్మకాలను నిలిపివేస్తారు. ఇదీ అసలు కథ.

అయితే ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌కు గాను అనేక కంపెనీలు ఫేజ్‌ 1, 2 దశల్లో ఉన్నాయి. ఆ దశలన్నీ పూర్తయి ఫైనల్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే సరికి కనీసం ఇంకో 6 నెలల సమయం అయినా పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. కనుక ఈ ఏడాది డిసెంబర్‌ వరకు కరోనా వ్యాక్సిన్‌ వస్తుందని మనం ఆశించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news