తిరుమలలో కరోనా కలకలం.. ఒకేసారి 10 మందికి..!

-

కలియుగ దైవం శ్రీవారి సన్నిధిలో కరోనా కలకలం రేపుతోంది. లాక్‌ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత తిరుమల వెంకన్న దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటిస్తూ.. దర్శనానికి అవకాశం కల్పించారు. అయినా కూడా కరోనా కలకలం సృష్టిస్తోంది. స్థానిక బాలాజీ నగర్ లోని ఓ వ్యక్తికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఆపై మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన టీటీడీ అధికారులు, దశలవారీగా ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో ఈ వారం ప్రారంభంలో తిరుమలలో విధులు నిర్వహిస్తున్న వారి నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపారు. టీటీడీ ఉద్యోగులు, స్వామి కైంకర్యాల్లో పాల్గొనే పూజారులు సహా మొత్తం 10 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే అధికారులు అప్రమత్తమై శానిటైజేషన్ పనులు పూర్తి చేశారు. వైరస్ సోకిన వారిలో నలుగురు సన్నాయి వాయిద్యకారులు, ఓ అర్చకుడు, ఐదుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నట్టుగా వెల్లడించారు. వారందరినీ వెంటనే ఆసుపత్రులకు తరలించారు.

వారి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ఇప్పటికే తిరుమలకు వచ్చే భక్తులందరికీ అలిపిరిలోనే థర్మల్ స్క్రీనింగ్ ను చేస్తున్నారు. అనారోగ్యంగా ఉన్నవారిని పైకి అనుమతించడం లేదు. వరుసగా టీటీడీలో సిబ్బందికి కరోనా సోకడం భక్తులను కూడా అయోమయానికి గురి చేస్తోంది. అలాగే తిరుమలలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ ప్రక్రియను చేస్తున్నామని, క్యూలైన్లను నిత్యమూ శుభ్రపరుస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news