అమెరికాలో ప్రతి ఏడాది థాంక్స్ గివింగ్ డేను జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. తమకు నచ్చిన వారికి లేదా తమ కుటుంబ సభ్యులు, తెలిసిన వారు, ఇతరులెవరైనా సరే.. వారికి బహుమతులను ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుతుంటారు. తమ కోసం ఎదుటి వారు ఏదైనా పనిచేస్తే అందుకు ధన్యవాదాలు తెలుపుతూ వారికి గిఫ్ట్‌లను ఇస్తారు. అయితే ఆ రోజు తరువాతి రోజును బ్లాక్ ఫ్రైడేగా జరుపుకుంటారు. నిజానికి అసలు బ్లాక్ ఫ్రైడే అంటే ఏమిటి ? దీన్ని జరుపుకోవడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి ? అంటే…
థాంక్స్ గివింగ్ డే, బ్లాక్ ఫ్రైడేలను కేవలం అమెరికాలోనే కాదు.. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో జరుపుకుంటున్నారు. అయితే థాంక్స్ గివింగ్ డే తరువాత బ్లాక్ ఫ్రైడే వస్తుంది. ప్రతి ఏటా నవంబర్ నెలలో నాలుగో శుక్రవారాన్ని బ్లాక్ ఫ్రైడేగా జరుపుకుంటారు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటంటే.. థాంక్స్ గివింగ్ డే రోజు సాధారణ రోజుల్లో కన్నా వ్యాపారులు ఎక్కువగా లాభాలను ఆర్జిస్తారు. వారు తమ లాభ నష్టాల పట్టికలో లాభాలను బ్లాక్ ఎంట్రీలతో, నష్టాలను రెడ్ ఎంట్రీలతో సూచిస్తారు. అయితే థాంక్స్ గివింగ్ డే తరువాత ఆ పట్టికలో అన్నీ బ్లాక్ ఎంట్రీలే ఉంటాయి. అంటే.. పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయని అర్థం. దీంతో వారు పౌరులకు డిస్కౌంట్లతో ఉత్పత్తులను అమ్మాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి బ్లాక్ ఫ్రైడేను నిర్వహిస్తూ వస్తున్నారు.
సాధారణంగా ఏడాది మొత్తంలో జరిగే అమ్మకాల్లో 20 శాతం అమ్మకాలు బ్లాక్ ఫ్రైడే రోజే జరుగుతాయని అంచనా. ఈ క్రమంలోనే అనేక కంపెనీలు బ్లాక్ ఫ్రైడే రోజున కస్టమర్లకు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయి. ఇక మన దేశంలోనూ దసరా, దీపావళి సందర్భంగా ఇలాంటి అమ్మకాలే కొనసాగుతాయి. కానీ విదేశాల్లో బ్లాక్ ఫ్రైడే సేల్స్ ను ఎక్కువగా నిర్వహిస్తారు.