కంప్యూట‌ర్ల‌లో ఉండే SSD, HDD అంటే ఏమిటో, వాటి మ‌ధ్య తేడాలేంటో తెలుసా..?

-

ప్ర‌స్తుత త‌రుణంలో దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రికీ కంప్యూట‌ర్ వాడ‌కం ఎంత ఆవ‌శ్య‌కం అయిందో అంద‌రికీ తెలిసిందే. దాంతో అనేక ప‌నులు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే చాలా మంది కంప్యూటర్ల‌ను (డెస్క్‌టాప్‌లు లేదా ల్యాప్‌టాప్‌లు) కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే కంప్యూట‌ర్ల‌ను కొనే వారికి స‌హ‌జంగానే వాటిలో ఉండే SSD, HDDల గురించి అనేక సందేహాలు వ‌స్తుంటాయి. దేన్ని ఏ అవ‌స‌రానికి వాడాలో, ఏ డివైస్‌ను ఎంత ప‌రిమాణంలో తీసుకోవాలో తెలియక అయోమ‌యానికి లోన‌వుతుంటారు. అయితే అస‌లు ఈ రెండు డివైస్‌ల‌లో దేని వ‌ల్ల ఏయే లాభాలు ఉంటాయో, వాటి మ‌ధ్య అస‌లు తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

what is ssd and hdd and their differences

SSD…

SSD అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ (Solid State Drive) అని పూర్తి అర్థం వ‌స్తుంది. సాధార‌ణంగా ఇవి కంప్యూట‌ర్ల‌లో ఉప‌యోగించే ర్యామ్ త‌ర‌హా ఆకృతిలో ఉంటాయి. కానీ వాటికి ఫ్లాష్ స్టోరేజ్ చిప్‌ల‌ను అమ‌రుస్తారు. ఈ క్ర‌మంలో SSD ఓ స్టోరేజ్ డ్రైవ్‌లా ప‌నిచేస్తుంది. అయితే SSDలు సాధార‌ణంగా 128 జీబీ మొదలుకొని 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్‌ల‌లో ల‌భిస్తాయి. ఇక వీటి ధ‌ర కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే SSDల‌ను సాధార‌ణంగా కంప్యూట‌ర్‌లో సి డ్రైవ్ కింద కేటాయిస్తారు. ఈ క్రమంలో అందులో ఇన్‌స్టాల్ అయి ఉండే విండోస్ ఆపరేటింగ్ సిస్ట‌మ్‌తోపాటు ఇత‌ర సాఫ్ట్‌వేర్లు చాలా వేగంగా ఓపెన్ అవుతాయి. దీంతో వాటితో మ‌నం వేగంగా ప‌నిచేసుకోవ‌చ్చు. SSDల‌ను సాధార‌ణంగా డేటా స్టోరేజ్ కోసం వాడ‌రు. అవి వేగంగా ప‌నిచేస్తాయి క‌నుక వాటిల్లో సాఫ్ట్‌వేర్ల‌ను ఇన్‌స్టాల్ చేసి వాడుతారు.

HDD…

హార్డ్ డిస్క్ డ్రైవ్‌ (Hard disk drive)కు సంక్షిప్త రూప‌మే HDD. ఇవి 1టీబీ మొద‌లుకొని 2టీబీ, 4 టీబీ, 5టీబీ స్టోరేజ్ ఆప్షన్ల‌లో ల‌భిస్తాయి. ఇక SSDల‌తో పోలిస్తే వీటి ధ‌ర త‌క్కువ‌గా ఉంటుంది. ఇవి SSDల క‌న్నా కొంచెం నెమ్మ‌దిగా ప‌నిచేస్తాయి. అందుక‌నే వీటిని డేటాను స్టోర్ చేసేందుకు ఉప‌యోగిస్తారు. కంప్యూట‌ర్ల‌లో SSDని సి డ్రైవ్‌గా ఇన్‌స్టాల్ చేస్తే, HDDని డి, ఇ, ఎఫ్ డ్రైవ్‌ల రూపంలో స్టోర్ చేస్తారు. ఈ క్ర‌మంలో సి డ్రైవ్‌లో ఉండే సాఫ్ట్‌వేర్ల‌ను ప‌నికోసం ఉప‌యోగిస్తే, మిగిలిన డ్రైవ్‌ల‌లో ఉండే హార్డ్ డిస్క్‌ను డేటా స్టోరేజ్ కోసం వాడుతారు.

అయితే కేవ‌లం SSD మాత్ర‌మే తీసుకోవాలా, HDD కూడా పీసీలో ఉండాలా.. అంటే.. కేవ‌లం సాఫ్ట్‌వేర్ల‌ను ఉపయోగించే వారు SSDల‌ను తీసుకుంటే చాలు, అదే డేటా స్టోరేజ్ కావ‌ల్సి వ‌స్తే.. HDDల‌ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news