ఈ సీజన్ లో శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటిని తాగు అవసరాలకే వినియోగించుకోవాలని కృష్ణ నది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. అక్టోబర్ 4న జరిగిన సమావేశంలో ఏపీకి 45 (శ్రీశైలం 30 + సాగర్ 15), తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించారు.
2024 మే దాకా ఈ నీళ్లు వాడుకోవచ్చు. సాగర్ నుంచి కేటాయించిన 15 టీఎంసీల్లో 5.2 టిఎంసిను నవంబర్ 29 దాకా ఏపీ తరలించింది. అయినా హఠాత్తుగా ఉద్రిక్తత సృష్టించడంపై ఇప్పటికీ కారణాలు తెలియరాలేదు. కాగా, ఈ ప్రాంతంలో ఇంకా పోలీసు పహారా కొనసాగుతోంది. ముళ్ల కంచెల నడుమ సాగర్ డ్యామ్‌పై పోలీసులు పహారా కాస్తున్నారు.
ఓవైపు ఏపీ వైపున భారీగా పోలీసులు మోహరించగా.. మరోవైపు తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు ఇవాళ అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేయనున్నట్లు సమాచారం . ఇప్పటికే సుమారు 4వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకోగా.. ప్రస్తుతం సాగర్‌లో నీటిమట్టం 522 అడుగులకు చేరింది. మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరేజీకి చేరే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.