ఆర్థిక అవసరాల కోసం ఇప్పుడు అందరూ పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు. 50 వేల నుంచి 20లక్షలైనా మీ ఆదాయాన్ని బట్టి తీసుకోవచ్చు. వీటికి ఎలాంటి సెక్యురిటీ లేదు. పర్సనల్ లోన్ తీసుకుంటే.. క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుందనే అనుమానం చాలా మందికి ఉంది. క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్థిక స్థితికి అద్దంలాంటిది. ఇది ఎంత ఎక్కువ ఉంటే..మీ ఫైన్షియల్ కండీషన్ అంత బాగుందని బ్యాంకులు నమ్ముతాయి. వ్యక్తిగత రుణం తీసుకుంటే నిజంగానే క్రెడిట్ స్కోరు దెబ్బతింటుందా లేదా చూద్దాం.
వ్యక్తిగత రుణం తీసుకున్నంత మాత్రన క్రెడిట్ స్కోరు దెబ్బతినదు. ఇంకా చెప్పాలంటే మీ క్రెడిట్ స్కోరు పెరిగేందుకు ఓ విధంగా ఈ రుణం ఉపయోగపడుతుంది. మీ అవసరాలకు తగిన పర్సనల్ లోన్ తీసుకుని సకాలంలో తిరిగి చెల్లింపులు చేయగలిగితే క్రెడిట్ స్కోరు మెరుగవుతుంది. ఇలా పర్సనల్ లోన్ తీసుకుని చెల్లింపులు చేయడం వల్ల మంచి క్రెడిట్ స్కోరును బిల్డ్ చేసుకోవచ్చు. పైగా ఇది భవిష్యత్‌లో హోమ్‌లోన్ రూపంలో పెద్ద మొత్తంలో రుణం తీసుకునే సమయంలో తక్కువ వడ్డీకే రుణం పొందడంలో సాయపడుతుంది.
ఇలా చేస్తే స్కోర్ తగ్గుతుంది..
అయితే, ఒక పర్సనల్ లోన్ ఉండగా.. మరో రుణం తీసుకుంటే మాత్రం మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం ఉంటుంది. సాధారణంగా రుణం మంజూరు చేసేటప్పుడు బ్యాంకులు హార్డ్ ఎంక్వైరీ చేస్తాయి. కాబట్టి మీ క్రెడిట్ స్వల్పంగా తగ్గుతుంది. అయితే, ఆ రుణం కూడా సకాలంలో చెల్లింపులు చేయగలిగితే మీ క్రెడిట్ స్కోరు మళ్లీ మెరుగవుతుంది. కాబట్టి ఒకవేళ ఒక రుణం ఉంటుండగానే రుణం అవసరం అయితే ఇంకో పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. అవసరానికి మించి పర్సనల్ లోన్ తీసుకుని సకాలంలో తిరిగి చెల్లింపులు చేయలేకపోతే మాత్రం క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. తిరిగి చెల్లింపుల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోతే మొదటికే మోసం వస్తుంది.
క్రెడిట్ స్కోర్ లోన్స్ విషయంలోనే కాదు.. క్రెడిట్ కార్డుల విషయంలోనే చాలా ప్రభావం చూపుతాయి. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటేనే క్రెడిట్ కార్డులు ఇస్తామని బ్యాంకులు ఎగబడాయి. లేదంటే. మీరు ఎంత ట్రై చేసినా కార్డు అప్రూవ్ చేయరు.