రెండో సారి కూడా అప్రతిహత విజయంతో అధికారంలోకి వచ్చి,అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ.. 75 రోజుల పాలనలో రెండు ప్రధాన సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి ముస్లిం మహిళలు ఎన్నాళ్లో వేచి చూస్తున్న తలాక్ బిల్లుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. తక్షణ తలాక్ నుంచి వారికి ఉపశమనం కలిగించారు. అదేసమయంలో తన ఊహల్లో ప్రధానమైన, అతి పెద్ద నిర్ణయం హిమాలయ రాష్ట్రం జమ్ము కశ్మీర్‌కు ఇప్పటి వరకు ఉన్న స్వయం ప్రతిపత్తిని తొలగించారు. అదేసమయంలో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబెడుతున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడంతోపాటు మరో ఆర్టికల్ 35 ఏని కూడా ఎత్తేశారు.
నిజానికి ఈ రెండు కూడా అత్యంత సాహసోపేత నిర్ణయాలే. గడిచిన 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ ఒక్క ప్రధాని కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకోలేదు. మోదీ సహా బీజేపీ నేతల మాటల్లో చెప్పాలంటే.. ఈ నిర్ణయంకారణంగా జమ్ము కశ్మీర్లో వివాదానికి, వేర్పాటు వాదానికి కూడా చెక్ పడుతుందని! అయితే, ఇప్పటికిప్పుడు మాత్రం జమ్ము కశ్మీర్ మండుతున్న అగ్ని గోళాన్ని తలపిస్తోంది. ప్రజల్లో కొత్తగా వచ్చి చేరిన స్వేచ్ఛ కన్నా కూడా సరికొత్తగా చోటు చేసుకున్న భయం తాలూకు ఆనవాళ్లు, నిర్బంధాల తాలూకు నిజాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు నెల రోజులు గడుస్తున్నా బిక్కు బిక్కు మంటూ జీవితాలను వెళ్లదీస్తున్నారు. అదేసమయంలో సైన్యం బూట్ల చప్పుడుతోనే కశ్మీర్ ప్రజలు తన రోజులను వెళ్లదీస్తున్నారు.
మరోపక్క, మోడీ నిర్ణయాన్ని.. పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అవసరమైతే.. యుద్దానికి ఎంత మాత్రం వెనుదీయబోమని, ఇప్పటికే తాము యుద్ధ సామగ్రిని, సైన్యాన్ని కూడా తమ సరిహద్దు వెంబడి మోహరించామని, కశ్మీర్ విషయం అంతు తేల్చుకునే వరకు తాము నిద్ర పోయేది లేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య మాటల మంటలు, యుద్ధ సన్నాహాలు కూడా పెరుగుతున్నాయి. వీటికి ఆజ్యం పోస్తూ.. మోడీ మెప్పు పొందేందుకు భారత సైన్యాధ్యక్షుడు ఏకంగా పాక్‌లోకి చొచ్చుకెళ్లి తంతామని ప్రకటనలు జారీ చేయడం మరింత వివాదాలకు తావిస్తోంది. ఇలా సాగుతున్న ఈ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేలు పెట్టారు.
తాను ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేస్తానని, సమస్యను పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. అయితే, తాజాగా జరిగిన జీ-7 దేశాల సదస్సులో ఇదే విషయాన్ని ప్రస్తావించిన నరేంద్ర మోడీ.. తమ విషయంలో మూడో పక్షం జోక్యం అక్కరలేదని, దాయాదుల మధ్య వైరాన్ని తాము మాత్రమే పరిష్కరించుకుంటామని అంతర్జాతీయ వేదికపై చెప్పుకొచ్చారు. అయితే, నిజానికి మోడీ ఇంత చరిష్మా గల నాయకుడేనా ? అనే సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. గతంలో వాజపేయి వంటి వారు ఇరు దేశాల మధ్య సన్నిహితం కోసం ఎంతో ప్రయత్నం చేసినా సాగని సాన్నిహిత్యం ఇప్పుడు కస్సుబుస్సు మనే మోడీ వల్ల అవుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ నేపథ్యంలోనే మోడీ విధానాలు దాయాదుల మధ్య మరింత వైరాన్నిపెంచడమే తప్ప.. తగ్గించేది కష్టమని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.