ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో నిజాలకన్నా నకిలీ వార్తలే ఎక్కువగా ప్రచారమవుతుంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. కొందరు తమకు ఎలాంటి లాభం రాకున్నా సరే.. అందరికీ నష్టం కలిగించాలన్న ఉద్దేశంతో ఫేక్ న్యూస్‌ను వాట్సాప్‌లో ఫార్వార్డ్ చేస్తుంటారు. దీని వల్ల చాలా సార్లు అనేక మంది ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇకపై అలాంటి ఫేక్ న్యూస్‌ను సులభంగా గుర్తించేందుకు వాట్సాప్ త్వరలోనే ఓ నూతన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది.
వాట్సాప్ తన యాప్‌లో ఫేక్ న్యూస్‌ను మరింత సులభంగా గుర్తించేందుకు త్వరలోనే ఫార్వార్డెడ్ మెసేజెస్ సెర్చ్ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు తమకు వాట్సాప్‌లో ఫార్వార్డ్ అయ్యే మెసేజ్‌లలో ఉండే టెక్ట్స్‌ను గూగుల్ లో వెదకవచ్చు. దీంతో ఆ మెసేజ్‌లలో ఉండే వార్త నిజమేనా, నకిలీనా అనేది సులభంగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఫేక్ న్యూస్‌కు అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంటుంది.
కాగా ఈ ఫీచర్‌ను వాట్సాప్ ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. త్వరలోనే దీన్ని యూజర్లకు అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో నకిలీ వార్తలు ఎక్కువగా ప్రచారం అవుతున్నందున ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే సదరు ఫేక్ న్యూస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవకాశం ఉంటుంది.