రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తు వేయాల్సిందే. అయితే, దానిని ఆచితూచి వేస్తే.. ఇబ్బందులు ఉండవు. కానీ, కేవలం కొందరిని సంతృప్తి పరచాలానే వ్యూహంతో అడుగులు వేస్తే.. అది ఏ పార్టీకైనా ఇబ్బందులు కొని తెస్తుంది. ఇదే జరిగింది.. టీడీపీ వైసీపీ విషయంలో అని అంటున్నారు పరిశీలకులు. తాజాగా రెండు పార్టీల్లోనూ పదవుల పందేరం జరిగిన మాట వాస్తవం. టీడీపీలో పార్లమెంటరీ జిల్లా ఇంచార్జులు అంటూ.. అసంతృప్తులను తృప్తి పరిచేకార్యక్రమం చేపట్టారు. దీనికి కొనసాగింపుగా ఇప్పటి వరకు లేని విధంగా పార్లమెంటరీ మహిళా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి టీడీపీలో ఇప్పటి వరకు ఇలాంటి పదవులు లేవు.
అయినా.. నేతలను ఏదో ఒక రూపంలో సంతృప్తి పరచాలనే తహతహలో చంద్రబాబు వీటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిని చూసిన వైసీపీ దాదాపు అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వాస్తవానికి ఈ వ్యూహం వైసీపీదే. అయితే. దీనిన ముందుగానే టీడీపీ అమలు చేసిందని వైసీపీనాయకులు అంటున్నారు. మొత్తానికి ఇంట్లో పడుకున్న వారిని కూడా బయటకు తీసుకువచ్చి.. రెండు పార్టీల్లోనూ పదవులు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ ప్రయోగం ఏమేరకు రెండు పార్టీలకూ మేలు చేస్తుందనేది ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం.
ఇప్పటికే టీడీపీలోను, వైసీపీలోనూ ఆధిపత్య రాజకీయాలు పెరిగిపోయాయి. ఎక్కడికక్కడ గ్రూపులు కూడా పెరిగాయి. దీంతో నేతల మధ్య అసంతృప్తులు పెరిగాయి తప్పితే.. పదవుల కోసం కాదనేది వాస్తవం. ఒకవేళ పదవుల కోసం అయినప్పటికీ.. వారిని వేరు చేసి.. క్షేత్రస్థాయిలో నెలకొన్ని ఆధిపత్య పోరు, అసంతృప్తులను చల్లార్చితే బాగుండేది. కానీ, ఇరు పార్టీలూ పదవుల పంపకంలో పోటీ పడి మరీ నేతలను తయారుచేసే పని ప్రారంభించాయి. అయితే, ఇది ఎన్నికల నాటికి మరింతగా ఆయా నియోజకవర్గాలు, సామాజిక వర్గాల్లో రగడకు దారితీస్తుందని, ఇరు పార్టీలకూ కూడా నష్టమేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఏంజరుగుతుందో చూడాలి.
-Vuyyuru Subhash