కోడెల స్థానం భర్తీ చేసేదెవరు..?

-

పల్నాడు ప్రాంతానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ పల్నాటి పులిగా పేరు తెచ్చుకున్న కోడెల శివప్రసాద్ మరణించి సరిగ్గా ఏడాది అయింది. డాక్టర్ వృత్తి నుంచి ఎన్టీఆర్ మీద అభిమానంతో టీడీపీలోకి వచ్చిన కోడెల వరుసగా అయిదుసార్లు నరసారావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో పనిచేశారు. అలాగే 2014లో సత్తెనపల్లి నుంచి గెలిచి నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన కోడెలపై అధికార పార్టీ ఒత్తిళ్ళు పెరిగాయి. ఆయన కుమారుడు, కుమార్తెలపై పలు ఆరోపణలు వచ్చాయి. ఇవి ఆరోప‌ణలు మాత్ర‌మే అని స‌రిపెట్టుకునేందుకు వీలు లేదు.. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని కోడెల త‌న‌యుడు శివరాం భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డ్డార‌న్న‌ది వాస్త‌వం.

ఇక కోడెలపై కూడా అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున బురద జల్లే కార్యక్రమం చేశారు. ఈ విధంగా ఆయనపై ఒత్తిడి పెరగడంతో స్వార్ధం కోసం పార్టీ మారకుండా, సెప్టెంబర్ 16 2019లో ఆత్మహత్య చేసుకుని తనువు చలించారు. ఏ టీడీపీలో రాజకీయ జీవితం మొదలుపెట్టారో, చివరికి అదే టీడీపీ జెండా కప్పుకుని కోడెల అంతిమయాత్ర జరిగింది. అయితే ఆయన తనువు చాలించి ఏడాది పూర్తి అయింది. కానీ సత్తెనపల్లిలో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేదు. చంద్రబాబు కూడా సత్తెనపల్లికి కొత్త నేతని తీసుకురాలేదు. ఇప్పటికీ నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది.

సత్తెనపల్లి ఇన్‌ఛార్జ్ పదవి తనకే వస్తుందని కోడెల తనయుడు శివరాం ధీమాగానే ఉన్నారు. లెక్క ప్రకారం కోడెల తనయుడుకే బాధ్యతలు అప్పగించాలి. కానీ సత్తెనపల్లి సీటు కోసం మరో సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు కూడా ప్రయత్నిస్తున్నారు. మొన్న ఎన్నికల సమయంలోనే రంగారావు సత్తెనపల్లిలో పోటీ చేయాలని చూశారు. కానీ చంద్రబాబు, కోడెలని కాదని మరొకరికి సీటు ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఇప్పుడు కోడెల మరణించడంతో సత్తెనపల్లి దక్కించుకోవాలని రంగారావు చూస్తున్నారు.

దీంతో చంద్రబాబు కోడెల తనయుడుకు సీటు ఇవ్వాలో, రాయపాటి తనయుడుకు సీటు ఇవ్వాలో తెలియక సత్తెనపల్లిలో కోడెల స్థానాన్ని భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచారు. మరి చూడాలి భవిష్యత్‌లో కోడెల స్థానం ఎవరితో భర్తీ అవుతుందో.. ?

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version