ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన సమయంలో.. వస్తున్న కొన్ని సర్వేల్లో ట్రంప్ కన్నా బైడెన్‌కే ప్రజాదరణ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సర్వేలను చూసి ట్రంప్ బృందం ఆందోళన చెందడం లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్‌దే ఆధిపత్యం అని సర్వేలు తేల్చాయి. చివరికి ట్రంప్ విజయం సాధించారు. ఈసారి కూడా అదే హిస్టరీ రిపీట్ చేస్తామంటున్నారు రిపబ్లికన్లు. ఈ సర్వే ఫలితాలతో నిరుత్సాహపడకుండా.. చివరిదశ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడానికి ప్యూహాలు
రచిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇక మూడు వారాలపాటు.. డొనాల్డ్ ట్రంప్, బైడెన్ మధ్య హోరాహోరీ ప్రచారం జరగనుంది. రెండో ప్రెసిడెన్షియల్ డిబేట్ రద్దుకావడంతో.. ఇక మూడో డిబేట్ పైనే అందరి దృష్టి పడింది. ఈ డిబైట్‌లో బైడెన్‌పై ఆధిక్యం సంపాదించి.. అమెరికా ఓటర్ల అభిమానాన్ని సంపాదించాలని ట్రంప్ ఎత్తులు వేస్తున్నారు. ఇందుకోసం రిపబ్లికన్ వ్యూహ బృందం ప్రణాళికలు రచిస్తోంది. కరోనా ఎఫెక్ట్, నిరుద్యోగం, ఆర్ధిక పరిస్థితి.. ఈ మూడు అంశాలే అమెరికా ఎన్నికల్లో కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
జాతీయ సర్వేలు దేశవ్యాప్తంగా ఏ అభ్యర్థికి ఎంత జనాదరణ ఉందో, తెలుసుకోడానికి బాగా ఉపయోగపడతాయి. కానీ, ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేస్తాయని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అమెరికా ఎన్నికల ప్రక్రియ విభిన్నంగా ఉంటుంది. ఎక్కువ ఓట్లు గెలుచుకున్నంత మాత్రాన, ఎప్పుడూ ఎన్నికల్లో విజయం సాధించడం అనేది జరగదు. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లే కీలకపాత్ర పోషిస్తాయి. 2016లో జరిగిన సర్వేల్లో హిల్లరీ క్లింటన్ దాదాపు 30 లక్షల పైగా ఓట్లతో డోనల్డ్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నారు. అయినా, ఆమె ఓడిపోయారు. అందుకు కారణం.. అమెరికాలో ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ.
గత ఏడాదికాలంగా వస్తున్న చాలా సర్వే ఫలితాలు.. జో బైడెన్‌కు అనుకూలంగానే ఉంటున్నాయి. ఎక్కువ జాతీయ సర్వేల్లో డోనాల్డ్ ట్రంప్ మీద పైచేయి సాధిస్తూనే ఉన్నారు. ఇటీవలి వారాల్లో ఆయన హవా 50 శాతం పెరిగింది. కొన్ని సార్లు ఆయన 10 పాయింట్ల ఆధిక్యం కూడా సంపాదించారు. అయితే గత ఎన్నికల సమయంలోనూ సర్వేల్లో ముందు వెనుకబడ్డ ట్రంప్.. చివరికి పుంజుకున్నారు. హిల్లరీకి గట్టిపోటీ ఇచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈసారి కూడా అలాంటి పరిస్థితి రాకుండా బైడెన్ బృందం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది
అమెరికా తన అధ్యక్షుడిని ఎన్నుకోడానికి ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థను ఉపయోగిస్తుంది. ప్రతి రాష్ట్రానికీ అక్కడి జనాభాను బట్టి కొన్ని ఓట్లు ఇస్తారు. అలా మొత్తం 538 ఓట్లు ఉంటాయి. అంటే, ఒక అభ్యర్థికి గెలవాలంటే 270 ఓట్లు సంపాదించాలి. చాలా రాష్ట్రాల్లో ఎవరికి ఆధిక్యం ఉందో తెలుస్తూ ఉంటుంది. ఇద్దరు అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్న రాష్ట్రాలను గుర్తించే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో గెలుపు, ఓటమిలను అందించే ఆ ప్రాంతాలను బాటిల్ గ్రౌండ్ స్టేట్స్ గా పిలుస్తుంటారు. అందుకే అభ్యర్థులు తరచూ ఎక్కువ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండే రాష్ట్రాల్లో ప్రచారం కోసం చాలా సమయం వెచ్చిస్తుంటారు.
ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అధికంగా ఉండే రాష్ట్రాల్లో జరిగిన సర్వేలను బట్టి చూస్తే.. సమీకరణాలు జో బైడెన్‌కు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఎన్నికల తేదీకి ఇంకా చాలా రోజుల సమయం ఉంది. ముఖ్యంగా డోనల్డ్ ట్రంప్ రంగంలోకి దిగితే, అక్కడి పరిస్థితులు చాలా వేగంగా మారిపోవచ్చు. మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో బైడెన్‌కు భారీ ఆధిక్యం లభిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. 2016లో ఈ మూడు పారిశ్రామిక రాష్ట్రాల్లో రిపబ్లికన్ ప్రత్యర్థి 1 శాతం కంటే తక్కువ మార్జిన్ ఓట్లతో విజయం సాధించారు. కానీ, 2016లో ట్రంప్‌కు ఘన విజయం అందించిన ఈ రాష్ట్రాలు ఇప్పుడు ఆయన ప్రచార బృందంలో ఆందోళన కలిగిస్తున్నాయి.
అప్పుడు లోవా, ఒహాయో, టెక్సాస్‌లో ఆయన గెలిచిన ఓట్ల మార్జిన్ 8-10 శాతం మధ్య ఉంది. కానీ ప్రస్తుతం ఆ మూడు రాష్ట్రాల్లో ఆయనకు బైడెన్‌తో పోటాపోటీగా ఉంది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ట్రంప్ గెలిచే అవకాశాలు.. మూడింట ఒక శాతమే అని అంటున్నారు.