ఆషాఢం వచ్చిందంటే చాలు అమ్మవారి దేవాలయాలలో శాకంబరీ ఉత్సవాలు చేస్తారు. కొన్ని ప్రాంతాలలో శ్రావణంలో కూడా చేస్తారు అది ప్రాంతీయ ఆచారం. అయితే అసలు శాకంబరీ అంటే కూరగాయలతో అమ్మవారి అర్చన. అలంకరణ ఎందుకు చేస్తారు. దీనివెనుకు పురాణగాథ తెలుసుకుందాం…
పూర్వం దుర్గమాసురుడనె ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని కొసం కొన్ని వందల సంవత్సరాల తపస్సు చేశాడు.బ్రహ్మ ప్రీతిపొంది ప్రత్యక్షం అయ్యి వరం కోరుకోమనగా వేదాలను అందరు మర్చిపొవాలని, వేద జ్ఞానం అంతా తనకే రావలని వరం కోరుకున్నాడు. దీంతో అతి తక్కువ సమయంలోనే అందరు వేదాలను మర్చిపొయారు. యజ్ఞయాగాదులు లేక దేవతలకు పూజలు లేవు, తత్ఫలితంగా వర్షాలు కురవడం లేదు. ప్రపంచమంత కరువు సంభవించింది.అది చూసిన రుషులు చలించిపొయారు. చివరకు రుషులు అందరు “సుమేరు పర్వతం” గుహలలోకి వెళ్ళి ఆ జగన్మాతను ప్రార్థిస్తారు.
వారి పలుకులను ఆ తల్లి విని వారి ఎదుట ప్రత్యక్షం అయ్యింది. నీలివర్ణంతొ అనేకమైన కళ్ళతో “శతాక్షి”అనే నామంతొ చతుర్భుజములుతొ కనిపించింది. ధనుర్బణాలతొ ఉన్న ఆ తల్లి ఈ దుర్గతిని చూసి తొమ్మిది రోజులపాటు కన్నుల నీరు కార్చింది. ఆమె కన్నిటితొ ఈ అన్ని నదులు నిండిపొయాయి.ఇక వారి దుస్థితిని చూడలేక అమ్మె శాకంబరిగా అవతరించింది. అమ్మ శరీరభాగాలుగా కూరలను, పండ్లను, గింజలను, గడ్డి మొదలైనవి ఉండగా, తన శరీరభాగలను అంటే శాకములను అన్ని జీవములకు ఇచ్చింది. ఆ రాక్షసుడును చంపి అమ్మవారు శాకంబరీదేవిగా ఆవిర్భవించి ఆకలిని తీర్చింది ఆషాఢమాసంలోనే. అందుకే ఆషాఢమాసంలో దేవీక్షేత్రాలలో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరిస్తారు. ఈ తల్లిని దర్శించి ప్రార్థిస్తే ఆ అమ్మదయతో అన్నానికి కొదువ ఉండదు. అంతేకాదు చదువు, జ్ఞానం లభిస్తాయిని పండితులు పేర్కొంటున్నారు.
ప్రతీ ఏటా తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశంలోని పలు అమ్మవారి దేవాలయాలలో ఈ ఉత్సవాలను ఆషాఢం లేదా శ్రావణమాసాలలో చేస్తారు. మనదగ్గర హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ పెద్దమ దేవాలయం, వరంగల్‌లోని భద్రకాళి, విజయవాడ కనకదుర్గమ్మదేవాలయాలలో విశేషంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.
-శ్రీ శాకంబరీ ఫోటోలు వాడగలరు