అక్రమ సంబంధాలు చివరికి విషాదంతాంగానే మిగులుతాయి అనడానికి ఈ ఘటనే నిదర్శనం. పదేళ్లుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం వదులుకోవాలని చూసినా వినిపించుకోకపోవడంతో పాటు.. పదిమందిలో తన భర్త అవమానాలకు గురికావడంతో భార్యభర్తలు పన్నిన పథకంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సంతకవిటి మండలం మద్దూరుశంరపేట గ్రామంలో చోటు చేసుకుంది. మద్దూరుశంరపేట గ్రామంలో హత్యకు గురైన అల్లబోయిన గోవిందరావు హత్య కేసు మిస్టరీని 24గంటల్లో పోలీసులు ఛేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంఆర్ అగ్రహారానికి చెందిన గోవిందరావు, శంకరపేట గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఈ విషయం తెలిసిన ఆమె భర్త పలుమార్లు పెద్దల వద్ద పంచాయతీ పెట్టినప్పటికీ గోవిందరావు వినిపించుకోలేదు. విశాఖపట్నంలో పనిచేస్తూ గ్రామానికి వచ్చిన ప్రతిసారి ఆమెను ఇబ్బందులకు గురి చేసేవాడు. ఇదిలా ఉండగా గోవిందరావు ఎప్పటికప్పుడు ఆమె భర్తను అవహేళన చేస్తూ అవమానకరంగా ప్రవర్తించేవాడు.
దీనిని భరించలేకపోయిన భార్యభర్తలు గోవిందరావును హతమార్చేందుకు పథకం పన్నారు. ఈ మేరకు ఐదు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన గోవిందరావును హత్య చేసేందుకు జంతువుల వేటకు ఉపయోగించే విధంగా జీఐ వైరుకు విద్యుత్ షాక్ వచ్చేలా ఏర్పాటు చేశారు. తమ ఇంటికి వస్తున్న దారితో జీఐ వైరుకట్టి దానికి విద్యుత్ సరఫరా అయ్యేలా చేశారు. ఇలా ప్రతిరోజూ రాత్రి ఏర్పాటు చేసి ఉదయం తీసేసేవారు. చివరికి ఈ నెల 25న రాత్రి శంకరరావు తన భార్యతో ఫోన్ చేయించి గోవిందరావును ఇంటికి రప్పించాడు. ఇంటికి వచ్చిన గోవిందరావు జీఐ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై అందిన సమాచారం మేరకు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేసి నిందితులుగా భార్యభర్తలను నిర్థారించి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని సీఐ వెల్లడించారు. సమావేశంలో ఆయనతోపాటు సంతకవిటి ఎస్సై ఆర్.జనార్దనరావు, లోకేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.