వైసీపీ సర్కారు మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకోబోతోందా.. ఏపీ హైకోర్టును రాయలసీమకు తరలించాలని నిర్ణయించిందా.. ఇందుకు తగిన కసరత్తు జరుగుతోందా.. అందుకే హైకోర్టు న్యాయవాదులు అమరావతిలోనే హైకోర్టు ఉంచాలని రోజూ ధర్నాలు చేస్తున్నారా.. ఈ మేరకు వైఎస్ జగన్ సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకుందా.. ఇవీ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారిన అంశాలు.
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత హైకోర్టు చాలా రోజులు హైదరాబాద్ లోనే ఉండిపోయింది. ఆ తర్వాత అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనం నిర్మాణం తర్వాత ఏపీ హైకోర్టు అమరావతికి తరలివచ్చింది. ఈలోపు ఏపీలో అధికారం చేతులు మారింది. దీంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం రాజధాని, హైకోర్టు అన్నీ అమరావతిలోనే ఉండేటట్లు ప్లాన్ చేశారు.
అమరావతి మాస్టర్ ప్లాన్ లో కూడా జస్టిస్ సిటీ అంటూ ఓ నగరం ఉంది. అయితే జగన్ సీఎం అయ్యాక అమరావతి విషయంలో స్తబ్దత నెలకొంది. ఆ మధ్య రాజధాని విషయం పరిశీలిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ బాంబు పేల్చారు. ఇప్పుడు మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. రాయలసీమకు హైకోర్టు తరలించే విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తోందని కామెంట్ చేయడం కలకలం రేపుతోంది.
మరి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి యథాలాపంగా ఆ మాట అన్నారా.. లేక.. జగన్ సర్కారు నిజంగానే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని భావిస్తోందా అన్నది ముందు ముందు కానీ తెలియదు. ఈ విషయంపై ప్రభుత్వం త్వరలోనే ఓ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మాత్రం ఉంది. లేకపోతే.. హైకోర్టు కోసం అన్ని ప్రాంతాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖలోనూ హైకోర్టు పెట్టాలన్న డిమాండ్ వస్తోంది. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ప్రభుత్వం తన నిర్ణయం త్వరగా ప్రకటిస్తే ఈ ఆందోళనలకు అడ్డుకట్టు పడుతుంది.