పేదలు వృద్ధాప్యంలో నెల నెలా డబ్బు కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను వారికి కచ్చితమైన పెన్షన్‌ను అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే.. అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) స్కీంను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఎవరైనా సరే నెల నెలా కొంత మొత్తంలో సొమ్మును పోస్టాఫీస్ లేదా బ్యాంకులో దాచుకుంటే వారికి వృద్ధాప్యంలో నెల నెలా నిర్దిష్టమైన మొత్తంలో కచ్చితమైన పెన్షన్ వస్తుంది.
కేంద్రం అమలు చేస్తున్న అటల్ పెన్షన్ యోజన స్కీంలో 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు చేరవచ్చు. నెలకు రూ.1వేయి మొదలుకొని రూ.5వేల వరకు పెన్షన్ వచ్చేలా ఇందులో ఆయా వయస్సుల వారు నెల నెలా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. వారు చెల్లించిన మొత్తాన్ని బట్టి నెల నెలా పెన్షన్ అందుకోవచ్చు.
ఈ పెన్షన్ ఖాతాను బ్యాంక్‌లో లేదా పోస్టాఫీసులో తెరవవచ్చు. ఇందుకు నామినీ లేదా భాగస్వామిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకంలో చేరేవారు నెల నెలా తమ పొదుపు మొత్తాన్ని చెల్లించవచ్చు. లేదా 3, 6 నెలలకు ఒకసారి కూడా పొదుపు మొత్తాన్ని చెల్లించవచ్చు. బ్యాంక్ అకౌంట్‌కు ఈ ఖాతాను ఆటోమేటిక్‌గా సెటప్ చేస్తే అందులోంచి డబ్బులు నేరుగా కట్ అయ్యే సదుపాయం కూడా కల్పించారు. ఈ స్కీంలో చేరిన వారికి పీఆర్ఏఎన్ కార్డు ఇస్తారు. దీంతో పెన్షన్ ఖాతాలో లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ఇక ఈ స్కీంలో 18 ఏళ్ల వయస్సు వారు చేరితే నెలకు రూ.42 పొదుపు చెల్లిస్తే వృద్ధాప్యంలో నెలకు రూ.1000 పెన్షన్ పొందవచ్చు. అదే రూ.210 చెల్లిస్తే నెలకు రూ.5వేల పెన్షన్ వస్తుంది. అంటే.. రోజుకు రూ.7 పొదుపు చేస్తే చాలన్నమాట. ఇక 40 ఏళ్ల వయస్సు వారు అయితే నెలకు రూ.1454 కడితే రూ.5వేల పెన్షన్ తీసుకోవచ్చు. రూ.291 పొదుపు చేస్తే నెలకు రూ.1000 పెన్షన్ ఇస్తారు. అదే రూ.126 నుంచి రూ.873 మధ్య కడితే నెలకు రూ.3వేల వరకు పెన్షన్ వస్తుంది.
ఈ పెన్షన్ మొత్తాన్ని రిటైర్మెంట్ ఏజ్.. అంటే.. 60 ఏళ్ల తరువాత నెల నెలా పొందవచ్చు.