హెల్మెట్ లేదని అడిగినందుకు ట్రాఫిక్ పోలీసులపై మహిళ దాడి.. మ‌ద్యం మ‌త్తులో రోడ్డుపై హంగామా.. వీడియో

మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఓ జంట ట్రాఫిక్ పోలీసుల‌పై దాడి చేశారు. హెల్మెట్ లేద‌ని అడిగినందుకు పోలీసులపై వారు దాడికి పాల్ప‌డి రోడ్డుపై హంగామా సృష్టించారు.

ఓ మహిళ.. ఒక వ్యక్తి.. ఇద్దరూ పట్టపగలే పీకలదాకా మద్యం సేవించారు. అనంతరం రోడ్డుపై టూవీలర్ మీద ప్రయాణం సాగించారు. దారిలో హెల్మెట్ లేదని చెప్పి ట్రాఫిక్ పోలీసు ఆపితే.. వారు అతనిపై దాడి చేశారు. కొంతసేపు రోడ్డుపై నానా హంగామా సృష్టించారు. మమ్మల్నే ఆపుతారా..? అంటూ అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులపై ఆ మహిళ విరుచుకు పడింది. ఆ తరువాత దెబ్బకు వారిద్దరీకి తాగిన మత్తు దిగింది. పోలీసులు ఆ జంటను అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఢిల్లీలో ఈ ఘటన నిన్న చోటు చేసుకోగా.. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పశ్చిమ ఢిల్లీలోని మాయాపూరిలో అనిల్ పాండే, మాధురి అనే ఇద్దరు పీకలదాకా మద్యం సేవించి టూవీలర్‌పై ప్రయాణం చేస్తున్నారు. అయితే మార్గమధ్యలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వారిని ఆపాడు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నందుకు జరిమానా కట్టాలని అన్నాడు. అంతే.. ఆ మాటలు విన్న మాధురి వెంటనే సదరు ట్రాఫిక్ పోలీసుపై అగ్గి మీద గుగ్గిలం అయింది. చెప్పు తీసుకుని అతనిపై దాడి చేసింది.

కాగా ఓ దశలో వారి వాహన తాళం చెవులను మరొక ట్రాఫిక్ కానిస్టేబుల్ తీసుకోగా.. అతనిపై ఆమె దాడి చేసి ఆ తాళం చెవులను లాక్కుంది. అయినా.. ఆమె ఆ పోలీసులిద్దరిపై దాడి చేయడం ఆపలేదు. దీంతో కొంతసేపు అక్కడ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం అయింది. ఆ తరువాత ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు. కాగా ఈ ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!