దిల్లీలో మరోసారి నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై దారుణంగా రెండ్రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అంతటితో ఆగకుండా ఆమె వ్యక్తిగత అవయవాలపై రాడ్డుతో దాడి చేశారు. ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ అఘాయిత్యానికి కారణం ఆస్తి తగాదాలేనని భావిస్తున్నట్లు తెలిపారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో పుట్టినరోజు వేడుకలకు వెళ్లింది బాధితురాలు. తర్వాత ఆ మహిళ సోదరుడు ఆమెను బస్టాండ్ వద్ద దింపాడు. బస్సు కోసం వేచి చూస్తుండగా.. కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా అందులోకి ఎక్కించారు. తర్వాత గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండ్రోజుల పాటు దారుణంగా హింసించి.. వ్యక్తిగత అవయవాలపై రాడ్డుతో దాడి చేశారు. అది ఇప్పటికీ ఆమె శరీరంలోనే ఉందని, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్ ట్వీట్ చేశారు.
దిల్లీకి సమీపంలోని ఆశ్రమ్ రోడ్డులో రక్తపు మడుగులో పడిఉన్న బాధితురాలి గురించి మంగళవారం పోలీసులకు సమాచారం అందింది. ఆ వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ‘ప్రాథమికంగా తెలిసిన సమాచారం మేరకు బాధితురాలు, నిందితులకు మధ్య ఆస్తి తగాదాలున్నాయి. ఆ వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటాం’ అని గాజియాబాద్ పోలీసు ఉన్నతాధికారి ట్వీట్ చేశారు.