తమిళనాడులో ఓ యువతి తన బంధువులకే టోపీ పెట్టింది. కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తానని చెప్పి మత్తు మందు ఇచ్చింది. అనంతరం వారు స్పృహ తప్పి పడిపోయారు. తరువాత వారి ఇంట్లో ఉన్న బంగారాన్ని ఆమె ఊడ్చేసి అక్కడి నుంచి ఉడాయించింది. అయితే పోలీసులు ఎట్టకేలకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడులోని పెరంబలూర్ జిల్లా కున్నమ్ తాలూకా కీజ్‌కుడికాడు గ్రామానికి చెందిన వి.సత్యప్రియ (26) స్థానికంగా ఓ ఆన్‌లైన్ మార్కెటింగ్ ఏజెన్సీలో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా తన బంధువు అయిన కె.రసథి అనే మహిళ ఇంటికి వెళ్లింది. అయితే తమకు కోవిడ్ టీకాలు వేయాలని రసథి ఆమెను కోరింది. దీంతో ఆమె సరే అని చెప్పి రసథితోపాటు ఆమె భర్త కృష్ణమూర్తి, కుమార్తెలు కృతుంగ, మోనికలకు ఇంజెక్షన్లు చేసింది.
అయితే ఇంజెక్షన్లు అయితే చేసింది కానీ అవి కోవిడ్ టీకాలు కాదు. మత్తు మందు ఇంజెక్షన్లు. దీంతో రసథి, ఆమె కుటుంబ సభ్యులు వెంటనే స్పృహ తప్పి పడిపోయారు. ఈ క్రమంలో వారి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను సత్యప్రియ కాజేసి అక్కడి నుంచి ఉడాయించింది. తరువాత ఆ కుటుంబానికి మరుసటి రోజు ఉదయం మెళకువ వచ్చింది. చూడగా.. ఇంట్లో ఉన్న బంగారం మాయమైందని, సత్యప్రియ తమకు ఇంజెక్షన్లు చేసి ఆ నగలను కాజేసిందని వారు నిర్దారించుకున్నారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొన్ని గంటల వ్యవధిలోనే సత్యప్రియను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి బంగారు నగలను రికవరీ చేసి ఆమెను రిమాండ్‌కు తరలించారు.