తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత పోరు ఒక్కసారిగా భగ్గుమంది. నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగే సమయానికే విబేదాలు బహిర్గతమయ్యాయా? లేదంటే అసమ్మతి నేతలంతా కావాలనే ఎన్నికల సమయంలో అలా వ్యవహరించారా? అనేది తర్వాత విషయం. మేయర్ అభ్యర్థిని ముందే ఖరారు చేయడం ఆ పార్టీ చేసిన తప్పు… ఎన్నికలకు ముందే నగరంలోని నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కినా పరిష్కరించే దిశగా పూర్తిస్థాయి ప్రయత్నం చేయకపోవడం తెలుగుదేశం పార్టీ కొంప ముంచింది. మా పార్టీ నాయకుడు ఎప్పుడూ ఇంతే… చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టకున్నట్లుగా వ్యవహరిస్తారు… ఆయన ఎప్పుడు మారతారో.. పార్టీ ఎప్పుడు బాగుపడుతుందో అంటూ తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.
పిలిచి మరీ అప్పగించింది
రాజకీయ రాజధాని బెజవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరమైంది. ఆ పార్టీ గెలుచుకుంది అనేకన్నా తెలుగుదేశం పార్టీయే స్వయంగా వైసీపీ చేతిలో బెజవాడను ఉంచిందంటే బాగుంటుంది. ఎంపీ కేశినేని నాని ఒంటెత్తు పోకడలు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బొండా ఉమ, నాగుల్ మీరా రోడ్డుకెక్కడం లాంటివన్నీఓటర్లపై ప్రభావం చూపించాయి. పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గతపోరును సరిగా అంచనా వేయకపోవడం, సీరియస్‌గా తీసుకోకపోవడం.. తూతూమంత్రంగా విభేదాలు పరిష్కరించడం.. సమన్వయాన్ని కుదర్చకుండా ఎవరి తోవన వారు పోవడంలాంటివెన్నోతెలుగుదేశం పార్టీ ఓటమికి కారణాలయ్యాయి.
టీడీపీని ముంచిన జనసేన
పశ్చిమ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థులకు బీఫాం ఇచ్చిన తర్వాత వారిని కాదని ఓసీ అభ్యర్థులను నిలబెట్టడంపై ఎంపీ నానిని బుద్దా బహిరంగంగానే విమర్శించారు. అంతర్గతంగా చర్చించుకోవాల్సిన ఈ అంశంపై బీసీ ఓటర్లలోకి వెళ్లింది. అందరూ ఐకమత్యంగా ఉంటే మరో పది స్థానాల్లో సునాయాసంగా టీడీపీ గెలవగలిగేది. మరోవైపు జనసేన కూడా ఓట్లను బలంగా చీల్చడం తెలుగుదేశంపై ప్రభావం చూపింది. చాలా స్థానాల్లో వైసీపీ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కంటే జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
వైసీపీకి కలిసొచ్చిన దేవినేని
విజయవాడ తూర్పులో వైసీపీ పుంజుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు 18వేల మెజారిటీ వచ్చింది. తాజా ఎన్నికల్లో వైసీపీ సుమారు 12వేల ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన యువనేత దేవినేని అవినాశ్ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేయడంలో కృతకృత్యులయ్యారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి ఎక్కువ స్థానాలు వస్తాయని అందరూ అంచనా వేశారు. మంత్రిపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలచుకోలేక ఆ పార్టీ చతికిలపడింది. అక్కడ 22 స్థానాలకుగాను 18 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీ కాస్తంత పోటీ ఇచ్చింది. సెంట్రల్లోని 28వ డివిజన్ నుంచి వైసీపీ నాయకుడు గౌతంరెడ్డి కుమార్తె లిఖితారెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.