భర్త నుంచి నెలకు రూ.6.16 లక్షలకు పైగా భరణం డిమాండ్ చేసిన ఓ మహిళను కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి తీవ్రంగా మందలించారు. రాధ మునుకుంట్ల అనే మహిళ.. హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 24 ప్రకారం తన భర్త నుండి ఆర్థిక సహాయం ఇప్పించాలని కోర్టును కోరింది. తన డిమాండ్‌ను సమర్థించుకోవడానికి తన నెలవారీ ఖర్చులను వివరించింది.
ఆగస్టు 20న జరిగిన విచారణలో.. రాధా మునుకుంట్ల తరఫు న్యాయవాది ఆమె ఖర్చుల వివరాలను కోర్టుకు సమర్పించి, తన క్లయింట్‌కు షూలు, దుస్తులు, బ్యాంగిల్స్, ఇతర ఉపకరణాలకు నెలకు రూ. 15,000, ఇంట్లో ఆహారం కోసం నెలకు రూ. 60,000, మోకాళ్ల నొప్పులు, ఫిజియోథెరపీ, వైద్య ఖర్చుల కోసం రూ.4-5 లక్షలు కావాలంది. దీంతో జడ్జి జస్టిస్ లలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ఖర్చు చేయాలనుకుంటే ఆమెనే సంపాదించుకోమనండి. భార్య అడిగినంత భరణం ఇప్పించడం చట్టం ఉద్దేశం కాదని మహిళ తరపు లాయర్‌కు స్పష్టం చేశారు. ఒంటరి మహిళ తన కోసం ఇంత ఖర్చు చేయాలనుకుంటే ఆమెనే సంపాదించుకోమనండి, ఆమె భర్త నుంచి కాదు.. భర్తకు శిక్షలా భరణం ఉండకూడదు జడ్జీ తెలిపారు.