ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయని పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా పెద్ద ఎత్తున డబ్బును నష్టపోతున్నారు. మోసగాళ్ల బారిన పడి డబ్బులు కోల్పోతున్నారు. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయినప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డబ్బులను పోగొట్టుకుంటున్నారు. ఇక తాజాగా మరో మహిళ women కు కూడా ఇలాగే జరిగింది.
మహారాష్ట్రలోని నల్లసోపారా ప్రాంతంలో ఉన్న నగిందస్పద అనే ఏరియాలో నివసించే ఓ మహిళ ఓ డిజిటల్ వాలెట్ ప్లాట్‌ఫాంలో కొన్ని నిత్యావసరాలను కొనుగోలు చేసింది. రూ.900 చెల్లించింది. అయితే రెండో రోజు ఆ స్టోర్ వారు తమకు డబ్బు అందలేదని చెప్పారు. దీంతో ఆమె సదరు ప్లాట్ ఫాంకు చెందిన కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో వెదికింది. ఆమెకు ఓ నంబర్ లభించింది. దానికి ఆమె కాల్ చేసి విషయం వివరించింది.
అయితే ఆమె కాల్ చేసింది అసలైన కస్టమర్ కేర్ నంబర్‌కు కాదు, నకిలీ నంబర్‌కు. దీంతో అవతల ఉన్నవ్యక్తి ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. అనంతరం అందులో డెబిట్ కార్డు వివరాలను ఎంటర్ చేసింది. తరువాత ఓటీపీతో ట్రాన్సాక్షన్ చేసింది. అంతే.. ఆమె అకౌంట్ నుంచి విడతల వారిగా మొత్తం కలిపి రూ.76వేలు క్షణాల్లో మాయమయ్యాయి. విషయం గ్రహించిన ఆ మహిళ తాను మోసపోయానని తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కనుక ఎవరైనా సరే కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్‌లో వెదకవద్దని, కంపెనీలకు చెందిన అధికారిక వెబ్ సైట్లలో వాటి సమాచారం తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.