ఐపీఎల్‌:హర్మన్,స్మృతి టీంల మధ్య నేడు ఫైనల్‌ పోరు…!

-

ఐపీఎల్‌ 2020 ఫైనల్‌కు ముందు మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ఇవాళ జరిగే మహిళల టీ20 ఛాలెంజ్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సూపర్‌నోవాస్‌తో.. ట్రయల్‌ బ్లేజర్స్‌ తలపడనుంది. వరుసగా మూడో టైటిల్‌పై హర్మన్‌ప్రీత్‌ సేన కన్నేయగా.. స్మృతి మంధాన జట్టు తొలి ట్రోఫీ కోసం ఆరాటపడుతోంది. ఇప్పటివరకు 2018, 2019ల్లో మహిళల టీ20 చాలెంజ్‌ జరుగగా.. హర్మన్‌సేనే టైటిళ్లు కైవసం చేసుకుంది.

లీగ్‌ దశ చివర మ్యాచ్‌లో బ్లేజర్స్‌పై సూపర్‌నోవాస్‌‌ గెలువడంతో రెండు జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయ్‌. నెట్‌ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో మిథాలీ రాజ్‌ కెప్టెన్సీలోని వెలాసిటీ ఇంటి బాట పట్టింది. ఇక సూపర్‌నోవాసే ఫైనల్ మ్యాచ్‌లో ఫేవరెట్‌. గత మ్యాచ్‌లో గెలిచిన సూపర్‌నోవాస్‌ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. శ్రీలంక ఓపెనర్‌ చమరి ఆటపట్టు‌ సూపర్‌ ఫామ్‌ సూపర్‌నోవాస్‌కు ప్లస్‌ పాయింట్‌. రెండు మ్యాచ్‌ల్లో ఆమె 111 పరుగులు చేసింది. ముఖ్యంగా ట్రయల్‌బ్లేజర్స్‌పై మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. రెండు మ్యాచ్‌ల్లోనూ 31 పరుగుల వద్ద ఔటైన హర్మన్‌ప్రీత్..‌ ఫైనల్లో టాప్‌ ఫామ్‌ను అందుకోవాలనుకుంటోంది. రోడ్రిగ్స్, పునియా, భాటియా రాణించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఫస్ట్‌ మ్యాచ్‌లో వెలాసిటీని 47 పరుగులకే కుప్పకూల్చిన ట్రయల్ బ్లేజర్స్ ఆ ప్రదర్శనను రిపీట్ చేయలేకపోయింది.

రెండు మ్యాచ్‌ల్లో కలిపి 39 పరుగులే చేసిన కెప్టెన్ మంధాన బ్యాట్‌ ఝళిపించాల్సి ఉంది. ఓపెనర్ డియాండ్రా డాటిన్ రాణిస్తోంది.. కానీ పెద్ద ఇన్నింగ్స్ ఆమె నుంచి బాకీ ఉంది. సూపర్‌నోవాస్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన దీప్తి శర్మ, హర్లీన్‌ మరోసారి సత్తా చాటాలని బ్లేజర్స్‌ ఆశిస్తోంది. రిచా ఘోష్, హేమలత, హర్లీన్ డియోల్ ఫామ్ అందుకుంటే మంధాన సేనకు తిరుగుండదు. సూపర్‌నోవాస్‌, ట్రయల్‌ బ్లేజర్స్‌ జట్లకు స్పిన్‌ విభాగం ప్రధాన బలం. బ్లేజర్స్‌ టీమ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ టీ20 బౌలర్‌ సోఫీ ఎక్లెస్టోన్‌, రాజేశ్వరీ గైక్వాడ్‌ రాణిస్తున్నారు. వెలాసిటీతో మ్యాచ్‌లో సోఫీ 9 పరుగులు ఇచ్చి ఏకంగా 4 వికెట్లు తీసింది. మరోవైపు నోవాస్‌ జట్టులో భారత లెగ్‌ స్పిన్నర్లు పూనమ్‌ , రాధా యాదవ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారు. ఇక పేస్‌ విభాగానికి వస్తే బ్లేజర్స్‌లో సీనియర్‌ జులన్‌ గోస్వామి రాణిస్తుండగా.. సూపర్‌ నోవాస్‌లో సౌతాఫ్రికన్‌ కాకా అదరగొడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news