భారత్ లో కరోనా వైరస్ కట్టడి విషయంలో మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడింది. కరోనా ప్రభావిత దేశ ప్రభుత్వాలు వైరస్ ని కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సమీక్షించింది. ఏ విధంగా కట్టడి చేస్తున్నాయి అనే దాని మీద ఆరా తీసింది. ఈ నేపధ్యంలోనే భారత్ తీసుకుంటున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ కొనియాడారు.
సమీక్ష అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన టేడ్రాస్… అసలే ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో రోజువారీ కూలీలను సైతం విస్మరించకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందించారు. ఈ కష్టసమయంలో ప్రతి ఒక్కరినీ ఆదుకునేందుకు గానూ గతవారం మోడీ ప్రభుత్వం రూ.1.7 లక్షల కోట్లను ప్యాకేజీగా ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. ఇలాంటి సమయాల్లో అలాంటి సహకారంనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇటువంటి విపత్కర సమయాల్లో ఇతర దేశాలకు సహాయం చేయలేవని వారు చేయాల్సినదల్లా ఇతర దేశాలకు రుణాల నుంచి విముక్తి కల్పించడమే అని ఆయన సూచనలు చేసారు. లాక్‌డౌన్ ప్రభావం భారత్‌లో ఎలా ఉందనేది ఇప్పుడప్పుడే అంచనా వేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్, షట్‌డౌన్‌లు కరోనావైరస్‌పై విజయం సాధించేందుకు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలని కొనియాడారు. కొంత సమయం వరకు లాక్‌డౌన్‌ను విధించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.