మ‌ట్టిలేకుండానే మొక్క‌ల సాగు.. అద్భుతం సృష్టించిన హైద‌రాబాద్ యువ‌కుడు..!

-

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు.. కాంక్రీట్ జంగ‌ల్స్‌లా మారుతున్నాయి. జ‌నాలకు నివాసం ఉండేందుకు స్థ‌లం అస్స‌లు దొర‌క‌డం లేదు. స‌రే.. ఆ మాట అటుంచితే.. తినేందుకు నాణ్య‌మైన ఆహారం కూడా లభించ‌డం లేదు. ర‌సాయ‌నాలు వేసి పండించిన కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల‌ను తింటున్నారు. దీంతో అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. మ‌రోవైపు క్రిమి సంహార‌క మందుల‌ను వాడి పంట‌ల‌ను పండిస్తుండ‌డం వ‌ల్ల రోజు రోజుకీ నేల‌ల్లో సారం పోతోంది. నిస్సార‌వంతంగా నేల‌లు మారుతున్నాయి. ఇక నీటి వినియోగం కూడా ఎక్కువైనందున‌.. పంట‌ల‌కు నీరందించ‌డం కూడా క‌ష్టంగా మారింది. అయితే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ చెక్ పెడుతూ.. ఆ యువ‌కుడు చేసిన ప్ర‌యోగం స‌క్సెస్ అయింది. ఎలాంటి ర‌సాయ‌నాలు వాడ‌కుండా.. పూర్తిగా సేంద్రీయ ప‌ద్ధ‌తిలో.. సాధార‌ణ పంట‌ల క‌న్నా చాలా చాలా త‌క్కువ‌గా నీటిని వాడుకుంటూ.. కాంక్రీట్ జంగిల్‌లా మారిన న‌గ‌రంలోనే మ‌ట్టి వినియోగం లేకుండా.. పంట‌ల‌ను పండించ‌డం మొద‌లు పెట్టాడు. అందులో విజ‌యం సాధించాడు. దీంతో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన ఫోర్బ్స్ జాబితాలో అత‌నికి చోటు ద‌క్కింది.

this hyderabad entrepreneur listed in forbes magazine for his success in hydroponics business

హైద‌రాబాద్‌కు చెందిన విహారి క‌నుకొల్లు అస‌న్ మెమోరియ‌ల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో కామ‌ర్స్ గ్రాడ్యుయేట్‌గా ప‌ట్టా పొందాడు. అనంత‌రం సీఏ చేశాడు. అయితే అత‌ను చ‌దివింది భిన్న‌మైన రంగానికి చెందిన కోర్సు అయినా.. అత‌నికి వ్య‌వ‌సాయం మీదే ఎక్కువ‌గా ఆస‌క్తి ఉండేది. దీంతో అత‌ను అధునాత‌న ప‌ద్ధ‌తుల్లో వ్య‌వ‌సాయం చేయ‌డం ఎలా..? అనే అంశాల‌పై ఎక్కువ‌గా దృష్టి సారించాడు. దీంతో అత‌నికి హైడ్రోపోనిక్స్ అనే విధానం బాగా న‌చ్చింది. ఈ క్ర‌మంలోనే 2017లో డాక్ట‌ర్ సాయిరాం ప‌లిచెర్ల‌, శ్రీ‌నివాస్ చాగంటి అనే మ‌రో ఇద్ద‌రితో క‌లిసి అర్బ‌న్ కిసాన్ (UrbanKisaan) అనే ఓ స్టార్ట‌ప్‌ను నెల‌కొల్పాడు. దాని స‌హాయంతో హైడ్రోపోనిక్స్ ద్వారా భిన్న‌ర‌కాల పంట‌ల‌ను పండించ‌డం మొద‌లు పెట్టి.. విజ‌యం సాధించాడు.

హైడ్రోపోనిక్స్ అంటే.. మ‌ట్టి అవ‌స‌రం లేకుండా కేవ‌లం నీటితోనే మొక్క‌ల‌ను పెంచ‌డం అన్న‌మాట‌. అయితే మొక్క‌ల‌కు పోష‌కాలు అందాలంటే.. మ‌ట్టి ఉండాలి క‌దా.. ఆ స‌మ‌స్య‌ను ఎలా అధిగ‌మిస్తారు..? అనే సందేహం ఎవ‌రికైనా రావ‌చ్చు. కానీ అందుకు కూడా సొల్యూష‌న్ ఉంది. మొక్క‌ల‌కు మ‌ట్టి నుంచి అందాల్సిన పోష‌కాల‌ను నీటిలో వేసి అందిస్తారు. మొక్క‌ల‌కు సంబంధించిన వేళ్లు ఎల్ల‌ప్పుడూ నీటిలోనే ఉంటాయి క‌నుక‌.. ఆ నీటిలో పోష‌కాలు వేస్తే.. మొక్క‌లు ఆ పోష‌కాల‌ను గ్ర‌హిస్తాయి. దీంతో స‌రైన టైముకు మొక్క‌ల‌కు నీళ్లు, పోష‌కాల‌ను అందిస్తే చాలు.. మ‌ట్టి అవ‌స‌రం లేకుండానే మొక్క‌లు పెరుగుతాయి. ఇక సాధారణ ప‌రిస్థితుల్లో పండించిన పంట క‌న్నా.. ఈ హైడ్రోపోనిక్స్ విధానంలో పండించిన పంట‌ల‌కు దిగుబ‌డి ఎక్కువ‌గా వ‌స్తుంది. అదే ఇందులోని విశేషం.

ఇక హైడ్రోపోనిక్స్ విధానంలో పంట‌ల‌ను పండించేందుకు ఎక్కువ స్థ‌లం కూడా అవ‌స‌రం లేదు. సిటీల్లో నివాసం ఉండే వారు.. అపార్ట్‌మెంట్ల‌లో ఉండేవారు కూడా.. త‌మ‌కు ఉండే కొద్దిపాటి స్థ‌లంలోనే భిన్న ర‌కాల మొక్క‌ల‌ను పెంచ‌వ‌చ్చు. ఇందుకు గాను అర్బ‌న్ కిసాన్ స‌హాయం చేస్తుంది. మొక్క‌ల‌ను పండించేందుకు అవ‌స‌రం ఉన్న కిట్ల‌ను, ఫ్రేమ్‌ల‌ను అందిస్తుంది. ఆ ఫ్రేమ్‌ల‌లో మొక్క‌ల‌ను పెంచుకోవ‌చ్చు. అవి 5 అర‌ల్లో ఉంటాయి. వాటిల్లో ఏకంగా ఒక్కోదాంట్లో 6 చొప్పున మొత్తం 30 మొక్క‌ల‌ను పెంచ‌వ‌చ్చు. ఇక ఈ ఫ్రేమ్‌ల‌కు నీరు ప్ర‌వ‌హిస్తుంటుంది. కింద నుంచి ఓ బ‌కెట్ ద్వారా నీటి పైపు క‌నెక్ష‌న్ ఇస్తారు. దీంతో ఫ్రేమ్‌ల‌లో నీరు ప్ర‌వ‌హిస్తుంది. అలా ఆ నీరు మొక్క‌ల‌కు అందుతుంది. ఒక చిన్న మోటార్‌ను పెట్టుకుంటే ఆ ఫ్రేమ్‌ల‌కు నీటిని ప్ర‌వ‌హించేలా చేయ‌వ‌చ్చు. ఇక బ‌కెట్‌లోని నీటిలో పోష‌కాలు వేస్తే.. అవి నీటి ద్వారా ప్ర‌వ‌హించి మొక్క‌ల‌కు చేరుతాయి. ఈ క్ర‌మంలో వారానికి ఒక్క‌సారి బ‌కెట్‌లో నీరు పోస్తే స‌రిపోతుంది. దీంతో ఎంతో నీరు ఆదా అవుతుంది. సాధార‌ణంగా పండించే పంట‌కు అవ‌స‌రం అయ్యే నీటిలో 95 శాతం నీటిని ఈ విధానం ద్వారా ఆదా చేయ‌వ‌చ్చు. కేవ‌లం 5 శాతం నీటితోనే హైడ్రోపోనిక్స్ ద్వారా పంట‌ల‌ను పండించ‌వ‌చ్చు.

కాగా ప్ర‌స్తుతం అర్బ‌న్ కిసాన్ లో ఒక సైంటిస్టు, 5 మంది పీహెచ్‌డీ చేసిన వారితో స‌హా మొత్తం ఇందులో 25 మంది వ‌ర‌కు ప‌నిచేస్తున్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని జూబ్లీహిల్స్‌లో ఒక భ‌వ‌నంలో పై అంత‌స్థును రెంట్‌కు తీసుకుని వీరు హైడ్రోపోనిక్స్ విధానంలో పంట‌ల‌ను సాగు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వీరు 1.25 ఎక‌రాల్లో సాగు చేసే పంట‌ను భ‌వ‌నంలో కేవ‌లం 2000 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలోనే సాగు చేస్తుండ‌డం విశేషం. ఇక ఈ విస్తీర్ణంలో వీరు పాల‌కూర‌, తోట‌కూర‌, గోంగూర‌, పుదీనా త‌దిత‌ర ఆకుకూర‌ల‌తోపాటు మొత్తం 40 ర‌కాల ఆకుకూర‌లు, కూర‌గాయ‌ల‌ను పండిస్తున్నారు. ఈ క్ర‌మంలో సాధార‌ణ స్థితిలో పండే పంట క‌న్నా హైడ్రోపోనిక్స్ విధానంలో పండే పంట చాలా త్వ‌ర‌గా చేతికొస్తుంది. అలాగే దిగుబ‌డి కూడా సాధార‌ణ పంట క‌న్నా ఎక్కువ‌గానే ఉంటుంది.

ఇక అర్బ‌న్‌కిసాన్ వారు న‌గ‌ర పౌరులు త‌మ బాల్క‌నీల్లోనూ హైడ్రోపోనిక్స్ విధానంలో పంటల‌ను సాగు చేసుకునేందుకు కావ‌ల్సిన స‌దుపాయాల‌ను అందిస్తున్నారు. అందుకు గాను వారు పౌరుల‌కు అవ‌స‌రం అయ్యే ఫ్రేములు, పంట‌ల‌కు కావ‌ల్సిన పోష‌కాల కిట్లు, ఇత‌ర సామ‌గ్రిని అంద‌జేస్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం హైద‌రాబాద్ న‌గ‌రంలో అనేక మంది ఈ విధానంలో పంట‌ల‌ను సాగు చేయ‌డం మొద‌లు పెట్టారు. కాంక్రీట్ జంగిల్స్‌గా మారుతున్న నగ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో స్థ‌లం లేక ఇబ్బందులు ప‌డేవారు హైడ్రోపోనిక్స్ విధానంలో చాలా సుల‌భంగా త‌మ‌కు కావ‌ల్సిన కూర‌గాయ‌ల‌ను పండించుకోవ‌చ్చ‌ని విహారి క‌నుకొల్లు తెలియ‌జేస్తున్నారు. ఈ విధానం 100 శాతం స‌హ‌జ‌సిద్ధ‌మైంద‌ని, పంట‌ల‌కు కృత్రిమ ఎరువుల అవ‌స‌రం ఉండ‌ద‌ని, చీడ పీడ‌లు రావ‌ని, అలాగే నీరు కూడా చాలా త‌క్కువ‌గా అవ‌స‌రం అవుతుంద‌ని అంటున్నారు.

సాధార‌ణంగా సిటీల్లో చాలా మందికి ఇండ్ల‌లో మొక్క‌ల‌ను పెంచుకోవాల‌ని ఉంటుంది.. కానీ స్థ‌లం లేక మొక్క‌ల పెంప‌కంపై అంత‌గా ఆస‌క్తి చూప‌రు. కానీ హైడ్రోపోనిక్స్ ద్వారా వారి కోరిక నెర‌వేరుతుంది. కేవ‌లం హాబీగా మాత్ర‌మే కాదు.. నిత్యం మ‌నం తినే కూర‌గాయలు, ఆకుకూర‌ల కోసం కూడా ఈ విధానంలో మొక్క‌ల‌ను పెంచుకోవ‌చ్చు. దీంతో స‌హ‌జ‌సిద్ధ‌మైన వెజిట‌బుల్స్ మ‌న‌కు ల‌భిస్తాయి. అలాగే మ‌న ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాగా హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్క‌ల‌ను పెంచే ప్ర‌క్రియ‌ను స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా కూడా ప‌ర్య‌వేక్షించ‌వ‌చ్చు. మొక్క‌ల‌కు ఎప్పుడు నీళ్ల‌ను పోయాలి, పోష‌కాల‌ను ఎప్పుడు, ఏ మేర వేయాలి.. పంట దిగుబ‌డి ఎప్పుడు వ‌స్తుంది.. త‌దిత‌ర వివ‌రాలు.. ఆ యాప్ ద్వారా తెలుస్తాయి. ఒక ర‌కంగా చెప్పాలంటే.. అధునాత‌న వ్య‌వ‌సాయ విధాన‌మే అయినప్ప‌టికీ.. పూర్తిగా స‌హ‌జ‌సిద్ధంగా ఈ విధానంలో మొక్క‌లు పెంచ‌వ‌చ్చు.

ఇక హైడ్రోపోనిక్స్ ను న‌గ‌ర‌వాసుల‌కు ప‌రిచ‌యం చేస్తూ ఆ రంగంలో దూసుకుపోతున్నందుకు గాను అర్బ‌న్‌కిసాన్ కో ఫౌండ‌ర్ విహారి క‌నుకొల్లు ఫోర్బ్స్ జాబితాలో కూడా చోటు ద‌క్కించుకున్నారు. ఈయ‌న 2020 సంవ‌త్స‌రానికి గాను ఆసియా ఇండ‌స్ట్రీ, మానుఫాక్చ‌రింగ్ అండ్ ఎన‌ర్జీ రంగాల్లో టాప్ 30 ఎంట‌ర్‌ప్రిన్యూర్‌ల‌లో ఒక‌రిగా చోటు సంపాదించారు. ఇక‌ ఇదంతా చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ఆయ‌న సాధించ‌డం మ‌రొక విశేషం..!

Read more RELATED
Recommended to you

Latest news