మానీ పాక్వియావో” 2015 “ఫైట్ ఆఫ్ ది సెంచరీ” ద్వారా ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బాక్సర్. ఆ మ్యాచ్ లో అతను ఓడిపోయినా సరే పేరుతో పాటు భారీగా పారితోషకం కూడా ముట్టింది. అప్పటికే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మొత్తం సంపాదించే ఆటగాళ్ళలో అతను ఒకడు. కోరుకున్న దేన్ని అయినా సరే సొంతం చేసుకునే తత్వ౦ అతనికి సొంతం. ఇదే సమయంలో అతని ఆలోచనా విధానం ప్రపంచాన్ని మైమరిపించింది. పేదరికం అనేదే ఉండకూడదని భావించి… పేద వారి కోసం ఏదైనా చెయ్యాలి అనే తపనతో వేసిన అడుగులు విమర్శకుల ప్రసంశలు పొందాయి.
2016 లో, పాక్వియావో తన స్వదేశంలో పేదల కోసం నిర్మించాల్సిన 1,000 గృహాలకు తన సొంత నిధులను ఖర్చు చేసాడు. ఆ నిర్మాణ బాధ్యతలను మొత్తం తానే దగ్గరుండి చూసుకున్నాడు. ఇక అతను చేసే సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తల్లి నుంచి పిల్లలకు ఎయిడ్స్ రాకుండా ఉండేందుకు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని తన దేశంలో విజయవంతంగా ప్రభుత్వ భాగస్వామ్యంతో చేస్తున్నాడు. 2015 లో జరిగిన ఫైట్ లో వచ్చిన వంద మిలియన్ డాలర్ల నగదులో సింహ భాగం సేవా కార్యక్రమాలకే వెచ్చించాడు అంటే…
ఇక అక్కడి ప్రభుత్వం కూడా అతనికి సహకరిస్తూ సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తుంది. అయితే ఇక్కడే అతనికి దెబ్బ తగిలింది… అతను చేసిన కొన్ని వ్యాఖ్యల దెబ్బకు… అతని ఆదాయం మొత్తం పడిపోయింది. స్వలింగ సంబంధాలలో ఉన్నవారు “జంతువులకన్నా అధ్వాన్నంగా” ఉన్నారని కొన్ని వ్యాఖ్యలు చేసాడు. ఇక అక్కడి నుంచి అతనిపై వ్యతిరేకత రావడంతో… అతనికి స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న పలు కంపెనీలు వెనక్కి తగ్గి అతనితో ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. అయితే అతను మాత్రం తన ఆస్తిని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాను, ఆదాయంతో తనకు సంబంధం లేదని ప్రకటించడం గమనార్హం.