యాదాద్రి తరహాలో కొండగట్టు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని.. రూ.100 కోట్లతో రూపు రేఖలు కొండగట్టు రూపురేఖలు మారనున్నాయని వెల్లడించారు ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ను యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ రూ.100 కోట్లు కెటాయించారని ప్రముఖ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి అన్నారు. ఆదివారం ఆయన కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు.
ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రూ.100 కోట్లతో కొండగట్టు అభివృద్ధి చెందడమే కాకుండా రూపురేఖలు కూడా మారనున్నాయన్నారు. ఆలయ విగ్రహం, ఆలయం, గోపురాలు, పార్కింగ్, పుష్కరిణి, త్రాగునీరు, స్నానాల గదులు, పరిసరాల పచ్చదనం – పరిశుభ్రత, రోడ్లు ఇత్యాది పనులు పక్కా మాస్టర్ ప్లాన్ తో చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా, జిల్లా ఎస్పి భాస్కర్, ఇతర ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా చర్చించారు. వారితో కలిసి ఆలయ పరిసరాలు, కొండలు తిరిగి పరిశీలించారు.