పార్టీ మారి టీడీపీలో ఓ వెలుగు వెలిగి… అధికారం పోయాక… ఛీ కొట్టి వెళ్లిన ఆయన ఇప్పుడు ఏం అయ్యారు? అధికార పార్టీలో చేరీ మళ్లీ చెలరేగిపోదామనుకున్న ఆ నేత ఆశలు అడియాసలు అయ్యాయా…జూపూడి ప్రభాకర్. మాలమహానాడులో కీలక నేత. ఆ తర్వాత కాంగ్రెస్ ఉన్నారు. వైసీపీలో చేరి కొద్ది కాలంలోనే పాపులర్ అయ్యారు. జగన్ పార్టీ పెట్టక ముందు నుంచి ఆయనకు గట్టి మద్దతుదారుడిగా మైక్‌ల ముందు దంచేసే వారు జూపూడి. ఆయన శ్రమను గుర్తించి 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా కొండెపి నియోజవర్గం సీటు ఇచ్చారు జగన్. కానీ అక్కడ గెలవలేకపోయారు జూపూడి. ఓడిపోయిన పార్టీలో ఉంటే మజా ఏం ఉంటుందని అనుకున్నారో ఏమో… రాత్రికి రాత్రి జెండా తీప్పేశారు.
టీడీపీలో కూడా ఆయనకు మంచి ప్రయార్టీ ఇచ్చారు. ఎమ్మెల్సీ సీటు కూడా ఇచ్చారు. అయితే ఆయన ఓటు హైదరాబాద్‌లో ఉండటంతో ఎమ్మెల్సీ సీటు చేజారిపోయింది. ఆ తర్వాత ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. జగన్ పక్కన ఎలాగైతే కీలకంగా ఉన్నారో… అప్పటి సీఎం చంద్రబాబు దగ్గర కూడా జూపూడి అంతే కీలకం అయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే టీడీపీ పుట్టినప్పటి నుంచి ఉన్న ఎస్సీ నేతల కంటే జూపూడికే ఎక్కువ ప్రయార్టీ దొరికింది.
అదంతా గతం. ఎప్పడైతే టీడీపీ ఓడిందో మనోడు మళ్లీ పాత ప్లాన్ బయటకు తీశాడు. ఓడిన టీడీపీలో ఉంటే మజా ఏం ఉంటుందని అనుకున్నారు. వైసీపీ శిబిరంతో రాయబారాలు.. చర్చలు.. చేరిక వెంట వెంటనే జరిగిపోయాయి. అవసరం ఉందనుకున్నారో.. లేక అవసరం లేకున్నా పార్టీలో ఉంటాడులే అనుకున్నారో ఏమో వైసీపీ నాయకత్వం కూడా ఆయన చేరికకు ఓకే చెప్పేసింది. ఎలాగైతే వెళ్లాడో మళ్లీ అలాగే వైసీపీ కండువా కప్పేసుకుని చేరిపోయారు.
కండువా అయితే కప్పేశారు కానీ… జూపూడిని పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించకుండా చేశారు. ఎవరి తరఫున మాట్లాడినా బల్లగుద్ది మరీ వాదించే జూపూడి వైసీపీ చేరీ చేరగానే వకాల్తా పుచ్చుకోవాలని చూశారట. దీన్ని గమనించిన వైసీసీ ఆయన్ను టీవీ చర్చలకు పిలవ వద్దని కో ఆర్డినేటర్లను కోరిందట. కట్ చేస్తే జూపూడి టీవీ చర్చలకూ దూరం అయ్యారు. పార్టీలో చేరిన తర్వాత ఒకే ఒక్కసారి తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ప్రభాకర్. అంతకు మించి ఆయన సేవలను వినియోగించుకోడానికి ఆ పార్టీ సిద్ధంగా లేదట. ఇలా జూపుడి ఏదో అనుకుంటే ఇంకేదో అయింది.