రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే ఎదురవుతున్నా వ్యతిరేకత, నిరసనలు హాట్ టాపిక్ గా మారాయి. నగరిలో రోజుకు చేదు అనుభవం ఎదురైందని సమాచారం. రెండు సార్లు వరుసగా విజయం సాధించిన ఆమె మూడోసారి నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యం పెట్టుకున్నారు. కానీ ఆమె లక్ష్యానికి అడ్డుకట్టగా సొంత పార్టీ నేతలే ప్రవర్తిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. నియోజకవర్గంలో రోజాకు ప్రజల నుంచేకాక సొంత పార్టీ నేతల నుంచి నిరసన సెగ ఎదురవుతుండటంతో ఆమె ఆశ అడియాస కాకతప్పదన్న భావన వైసీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. నగరిలో తనకు వ్యతిరేకంగా కూటమికి మద్దతుగా మెజార్టీ వైసీపీ నేతలు నినదిస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. నగరిలో తనను ఓడించేందుకు కొందరు వైసీపీ నేతలు పనిచేస్తున్నారని ఆమె చెప్పారు. జగన్ నుంచి నామినేటెడ్ పదవులు తీసుకున్న కేజే కుమార్, ఆయన వర్గీయులు తన ఓటమి కోసం టీడీపీ నేతల కంటే ఎక్కువగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. కాగా గతంలోనూ పెద్దిరెడ్డి వంటి పార్టీ సీనియర్లతో ఈమెకు విభేదాలున్నాయి.