కోరి తెచ్చుకుంటే కొంప ముంచిందా..ఆ రెండు జిల్లాల వైసీపీ నేతల్లో టెన్షన్

-

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి బ్రహ్మరథం పట్టిన జిల్లాల్లో విజయనగరం ఒకటి. జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాలతోపాటు ఈ ప్రాంతానికి అనుబంధంగా ఉన్న విజయనగరం, అరకు, విశాఖ లోక్‌సభ స్థానాలను సైతం వైసీపీ గెల్చుకుంది. జిల్లాలో ఇక తిరుగులేదని భావించారు వైసీపీ నాయకులు. అలాంటి వారందరికి మాన్సాస్‌ సంస్థ తీసుకుంటున్న నిర్ణయాలతో ముచ్చెమటలు పడుతున్నాయట. ఆ సంస్థ నిర్ణయాలు పార్టీకి సంబంధం లేకపోయినా..ఆ ప్రభావం తమపై ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట వైసీపీ ప్రజాప్రతినిధులు.

జిల్లాలో టీడీపీకి కీలక నేతగా ఉన్న పూసపాటి గజపతుల వారసుడు అశోక్ గజపతిరాజుకు రాజకీయంగా చెక్‌ పెట్టేందుకు మాన్సాస్ ట్రస్ట్‌.. సింహాచలం దేవస్థానం చైర్మన్‌ పదవుల నుంచి తొలగించింది అధికారపార్టీ. ఎక్కడో ఢిల్లీలో బీజేపీ ప్రతినిధిగా ఉన్న ఆనందగజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచైతను తీసుకొచ్చి మాన్సాస్‌తోపాటు.. సింహాచలం మరో 105 దేవస్థానాలకు చైర్మన్‌ను చేసింది. అశోక్‌ గజపతిరాజుకు కట్టడి చేసేందుకు సంచయితకు మాన్సాస్‌ పగ్గాలు అప్పగించడం వరకు బాగానే ఉన్నా.. తర్వాత ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు.. వైసీపీ నేతలకు ఇబ్బందిగా మారాయన్నది పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

మాన్సాస్‌ చైర్మన్‌ హోదాలో సంచైత.. టీడీపీ నేత అశోక్‌ గజపతిరాజును టార్గెట్‌ చేసుకున్నారు. పదునైన విమర్శలతో ఆమె అశోక్‌పై దాడి చేస్తుంటే తమకు మంచి ఆయుధం లభించిందని వైసీపీ నేతలు ఖుషీ అయ్యారు. కానీ.. మహారాజా కాలేజీ ఎయిడెడ్‌ హోదాను సరెండర్‌ చేయాలని నిర్ణయించడం.. జూనియర్ కాలేజీ మూసివేత దిశగా అడుగులు వేయడం పార్టీలోనే కాదు.. జిల్లావ్యాప్తంగా చర్చకు దారితీసింది. మాన్సాస్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, విపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయి. పైగా మాన్సాస్‌ వెనక వైసీపీ ఉందని నేరుగానే అధికార పార్టీపై వారంతా విమర్శలు చేస్తున్నారు.

కోరి తెచ్చుకుంటే సంచైత కొంప ముంచుతున్నారనే భయం పట్టుకుంది వైసీపీ నేతల్లో.. ఆ సంస్థ తీసుకుంటున్న నిర్ణయాలు అధికారపార్టీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.ఇదెక్కడి గొడవ అని వైసీపీ నేతలు అనుకుంటోన్న సమయంలోనే లేటెస్ట్‌గా మాన్సాస్‌ పరిధిలోని అయోధ్య మైదానంలోకి కాలేజీ వారు తప్ప బయట వ్యక్తులు ఎవరూ వాకింగ్‌, వ్యాయామాలకు రాకూడదని ఆంక్షలు పెట్టారు. ఈ నిర్ణయంపై నగర వాసులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వందేళ్లుగా అయోధ్య మైదానంతో విజయనగరం వాసులకు అనుబంధం ఉందని.. వేకువ జామున వ్యాయామాలకు ప్రజలు ఉపయోగించుకుంటే తప్పేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారట. వైసీపీలోని కొందరి అభిప్రాయం కూడా ఇదేనని సమాచారం.

ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు చెప్పకుండా మాన్సాస్‌ ట్రస్ట్‌ సొంతంగా తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమై తమకు చేటు తెచ్చేలా ఉన్నాయని అధికార పార్టీనేతలు అభిప్రాయపడుతున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. విజయనగరం మున్సిపాలిటీ కార్పొరేషన్‌ అయ్యాక అక్కడ మొదటిసారి మేయర్‌ పీఠం చేజిక్కించుకోవాలని వైసీపీ నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. మారిన పరిణామాలతో పైకి చెప్పకపోయినా.. లోలోన కలవరపడుతున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version