నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్న విషయంపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలోనే నేతలు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఇప్పటికే వైసీపీ రెడ్డి నాయకులు బహిరంగ విమర్శలు కూడా చేస్తున్నారు. ఏకంగా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ.. నేతల దూకుడు, అధికారుల వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్లో ఇది కలకలం సృష్టించింది. ఆ తర్వాత కోటంరెడ్డి వర్సెస్ కాకాని గోవర్ధన్‌రెడ్డి మథ్య తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి.
ఇవన్నీ ఓ మంత్రి కనుసన్నల్లో జరుగుతున్నాయని, రెడ్డి సామాజిక వర్గంపై ఆయన పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా.. ఎవరూ వీటిని సీరియస్‌గా తీసుకోలేదు. జిల్లా వ్యాప్తంగా ఓ మంత్రి హవా చలాయిస్తున్నారని సీఎం జగన్ కూడా ఆయనకే మద్దతుగా ఉన్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా, మరొకరు బీసీ వర్గానికి చెందిన నాయకుడు. దూకుడు ఎక్కువగా చూపిస్తూ.. ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఈయనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.
అయితే, ఇప్పుడు ఇద్దరి మంత్రుల మధ్య కూడా ఆధిపత్య ధోరణి ప్రారంభమైందని అంటున్నారు పరిశీలకులు. నెల్లూరులో ఏపని చేయాలన్నా..తన కనుసన్నల్లోనే జరగాలని ఓ మంత్రి పట్టుబడుతున్నారు. దీంతో అధికారులు సైతం హడలి పోతున్నారు. తాజాగా ఏం జరిగిందంటే.. మంత్రి గౌతంరెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద పారిశుద్ధ్య సమస్య ఘోరంగా ఉండటంతో ఎన్నిసార్లు అధికారులకు ఫోన్లు చేసినా స్పందించలేదు. దీంతో మంత్రి క్యాంపు ఆఫీసు నుంచి ఫోన్ చేసినా ఎవరూ పట్టించులేదు.
దీంతో మంత్రి స్వయంగా కలవమని చెప్పినా హెల్త్ ఇన్‌స్పెక్టర్ సహా ఎవరూ రాలేదు. దీంతో మంత్రి గౌతంరెడ్డి నేనంటే లెక్కచేయరా? అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే, దీనివెనుక మంత్రి గౌతంరెడ్డి క్యాంపు మాత్రం రాజకీయంగా తమ మంత్రిని అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఏదేమైనా జిల్లా అధికార పార్టీలో ఉన్న గ్రూపుల గోలను ఇప్పటికైనా చక్కదిద్దాలని వైసీపీ సీనియర్లు సైతం కోరుతున్నారు. లేనిపక్షంలో పార్టీలో మరిన్ని గ్రూపులకు బీజం పడడం ఖాయంగా కనిపిస్తోంది.
-Vuyyuru Subhash