వాట్సాప్‌లో టెక్నికల్‌ ఫాల్ట్‌!

-

వాట్సాప్‌ ప్రైవసీ విషయంలో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. దీనివల్ల వినియోగదారులు ప్రత్యామ్నాయ యాప్‌లను చూసుకున్నారు. అయితే వాట్సాప్‌ గురించి ఇప్పుడు మరో టెక్నికల్‌ ఫాల్ట్‌ బయటపడింది.

దీంతో హ్యాకర్లు ఏమైనా చెయ్యగలరు అన్నది సైబర్‌ నిపుణుల మాట. హ్యాకర్ల దాడిని తప్పించుకునేలా… ప్రతీ సాఫ్ట్‌వేర్‌కీ కొన్ని భద్రతాపరమైన ఫీచర్లు ఉంటాయి. అందుకే బ్యాంకుల వంటి సైట్లు సెక్యూర్డ్‌గా ఉంటున్నాయి. ఫేస్‌బుక్, వాట్సాప్‌ లాంటి సోషల్‌ మీడియా సైట్లపై హ్యాకర్ల దాడులు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి… మీ ఫోన్‌ నంబర్‌ ఉపయోగించి… మీ వాట్సాప్‌ అకౌంట్‌ను సస్పెండ్‌ చెయ్యగలరు. ఈ విషయాన్ని భద్రత నిపుణులు కనిపెట్టారు.దీనివల్ల కొన్ని కోట్లాది మంది వాట్సాప్‌ వినియోగదారులు ఖాతాలు ప్రమాదంలో పడనున్నాయి.

మీ మొబైల్‌లోని వాట్సాప్‌ మీకు తెలియకుండానే డీ–యాక్టివేట్‌ చెయ్యగలరు. తిరిగి మీరు యాక్టివేట్‌ చేసుకుందామన్నా, అడ్డుకోగలరని తెలిపారు. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేలా… చాలా మంది వినియోగదారులు… 2 ఫ్యాక్టర్‌ ఆథెంటికేషన్‌ (2ఎఫ్‌ఏ) అనే విధానం ద్వారా వాట్సాప్‌ను సెక్యూర్డ్‌గా ఉంచుకుంటున్నారు. కానీ, దీన్ని కూడా హ్యాకర్లు డీకోడ్‌ చేసి… అకౌంట్‌ని సస్పెండ్‌ చెయ్యగలిగే అవకాశం ఉందని పరిశోధకులు తేల్చారు.

హ్యాకర్లు మీ ఫోన్‌ నంబర్‌ ఉపయోగించి… వారి మొబైల్‌లో వాట్సాప్‌ ని ఇన్‌ స్టాల్‌ చెయ్యగలరట. ఇలా చేసేటప్పుడు 6 అంకెల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ ఒకటి మీ మొబైల్‌కి వస్తుంది. ఆ కోడ్‌ ఎంటర్‌ చెయ్యకపోతే… హ్యాకర్‌ తన మొబైల్‌లో ఇన్‌ స్టాల్‌ చేసుకున్న వాట్సాప్‌ని ఉపయోగించలేడు. కానీ, దీనికోసం హ్యాకర్‌… రకరకాల కోడ్లు ఎంటర్‌ చేస్తాడు. కొన్నిసార్లు ఫెయిల్‌ అయ్యాక… కోడ్‌తో పనిలేకుండా వాట్సాప్‌ ఓపెన్‌ అవుతుందనీ… ఇలా 12 గంటలపాటూ… అది పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు.

ఇక హ్యాకర్లు అదే పనిగా మీ వాట్సాప్‌లో కోడ్‌ ఎంటర్‌ చెయ్యడానికి ప్రయత్నించరు. దాని బదులుగా… వాట్సాప్‌ సపోర్ట్‌ని కాంటాక్ట్‌ చేసి… మీ మొబైల్‌ నంబర్‌ ఇచ్చి… దాన్లో సగం యాక్టివేట్‌ అయిన వాట్సాప్‌ని డీయాక్టివేట్‌ చేయమని అడుగుతారు. తన ఫోన్‌ ని ఎవరో దొంగిలించారని చెబుతారు. అప్పుడు వాట్సాప్, మీ ఒరిజినల్‌ వాట్సాప్‌ అకౌంట్‌ను రద్దు చేస్తుంది. ఆ తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా మీ అసలు మొబైల్‌లోని అసలైన వాట్సాప్‌ ఓపెన్‌ కాదు.

సాధారణంగా వాట్సాప్‌ని డీయాక్టివేట్‌ చెయ్యడానికి వాట్సాప్‌… మీ మొబైల్‌ నంబర్‌ను వెరిఫై చేస్తుంది. పై కేసులో మొబైల్‌ పోయిందని హ్యాకర్‌ చెబుతాడు కాబట్టి… వెరిఫికేషన్‌ లేకుండానే డీయాక్టివేట్‌ చేస్తుందని నిపుణులు తెలిపారు. మీరు కొత్తగా మరోసారి వాట్సాప్‌ని ఇన్‌ స్టాల్‌ చేసుకుందామన్నా… 12 గంటల వరకూ మీకు రిజిస్ట్రేషన్‌ కోడ్‌ రాదు. 12 గంటల తర్వాత హ్యాకర్‌ మళ్లీ ఇలాగే చేస్తే… మళ్లీ మీరు వాట్సాప్‌ని మరో 12 గంటల వరకూ రిజిస్టర్‌ చేసుకోలేరు. ఇక మీరు ఈమెయిల్‌ ద్వారా వాట్సాప్‌ మేనేజ్‌మెంట్‌ని కంటాక్ట్‌ చెయ్యాల్సి ఉంటుంది.

కొంతవరకూ హ్యాకర్‌ ఈ దాడి లేకుండా అడ్డుకోవచ్చు. ఈ సమస్యపై వాట్సాప్‌ ఇంకా స్పందించలేదు. వాట్సాప్‌ వినియోగదారులు ఇండియాలో 40 కోట్ల మంది దీన్ని వాడుతున్నారు. చాలా మంది యూజర్లు… తమ ఈమెయిల్‌ అడ్రెస్‌ను వాట్సాప్‌కి ఇవ్వలేదు. అలా ఈమెయిల్‌ అడ్రెస్‌ ఇవ్వని వారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news