కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో 47 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. గతంలో నిషేధించబడిన 59 చైనా యాప్‌లకు క్లోన్ యాప్‌లుగా భావిస్తున్న 47 యాప్‌లను నిషేధించారు. అయితే మరో 250 యాప్‌లను ప్రస్తుతం కేంద్రం పరిశీలిస్తుందని తెలిసింది. త్వరలోనే ఆ యాప్స్‌ను కూడా నిషేధించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ యాప్‌లలో ప్రముఖ మొబైల్ గేమ్ పబ్‌జి కూడా ఉంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పబ్‌జి లవర్స్ ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.
అయితే పబ్‌జి గేమ్‌ను నిషేధిస్తే దేశంలో ఉన్న యువత అంతా మోదీ ప్రభుత్వాన్ని ఉద్యోగాలు ఇవ్వాలని అడుగుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్ చేశారు. పబ్‌జి గేమ్‌ను నిషేధిస్తే దేశంలో ఉన్న యువత ఇతర సమస్యలపై దృష్టి పెడతారని, ముఖ్యంగా నిరుద్యోగ సమస్య గురించి వారు ఆలోచిస్తారని, తమకు ఉద్యోగాలు ఇవ్వాలని మోదీని వారు అడుగుతారని అన్నారు. అందువల్ల యువత దృష్టి ఆయా సమస్యల వైపు మళ్లకుండా ఉండాలనే మోదీ పబ్‌జి నిషేధించడం లేదని అన్నారు.
కాగా పబ్‌జి గేమ్ నిజానికి దక్షిణ కొరియాకు చెందిన ఓ గేమ్ డెవలపింగ్ కంపెనీకి చెందినది. కానీ అందులో చైనాకు చెందిన పలు టెక్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. అందువల్లే పబ్‌జి గేమ్‌ను నిషేధిస్తారని ప్రచారం జరుగుతోంది. సదరు 250 యాప్‌లలో పబ్‌జి గేమ్ యాప్ కూడా ఉండడంతో ఇప్పుడు పబ్‌జి గేమ్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు.