కరోనా కట్టడిలో ఏపీ సీఎం జగన్ మరో కీలక అడుగు వేశారు. ఇప్పటికే ఆయన దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వమూ చేయని విధంగా వలంటీర్ల వ్యవస్థతో కరోనా కట్టడికి తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు. వలంటీర్లను గ్రామ, మండల, నగర స్థాయిలో ఇంటింటి కీ పంపి.. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా? అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఏపీలో మాత్రం కరోనా కట్టడి విషయంలో జగన్ వ్యూహం ఫలించింది. వలంటీర్ వ్యవస్థ కారణంగా.. రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్యను ముందుగానే గుర్తించి, రోగులను క్వారంటైన్ చేయడంలోనూ ప్రభుత్వం సఫలీ కృతమైంది. ఇక, ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జగన్ మరో ముందడుగు వేశారు.
ప్రస్తుతం కరోనా టెస్టింగ్ కేంద్రాలు రాష్ట్రంలో మూడు మాత్రమే ఉన్నాయి. తిరుపతి, కాకినాడ, విజయవాడల్లోనే ఈ కేంద్రాలు ఉన్నా యి. ఇక్కడ కూడా రోజుకు రెండు వేలకు మించి పరీక్షలు సాగడం లేదు దీంతో.. రోగులు ఆసుపత్రుల్లో చేరిన తర్వాత వారం పదిరోజుల కు కానీ రిపోర్టులు రావడం లేదు. దీనికితోడు ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే.. ఈ నమూనాలను పుణేకు పంపి అక్కడ నిర్ధారించుకుంటున్నారు. ఫలితంగా సమయం మించిపోతోంది. ఈ తరహాలోనే విజయవాడలో ఓ మరణం నమోదైంది. రిపోర్టులు వచ్చే లోగానే రోగి మృతి చెందారు.
ఇక, కేంద్రం కూడా రాష్ట్రాలపై ఒత్తిడి పెంచింది. కరోనా టెస్టింగ్ కేంద్రాలను పెంచాలని సూచించింది. అయితే, ఈ సూచనలు పాటించేందుకు మిగిలిన రాష్ట్రాలు ఆర్ధిక సమస్యలను తెరమీదికి తెచ్చాయి. కానీ, ఏపీలో మాత్రం ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా రోగులకు నిర్ధారణ చేసే టెస్టులను మరింత వేగం పెంచేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాకో టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని తాజాగా ఆయన ఆదేశించారు. అంతేకాదు, అన్ని ప్రైవేటు వైద్య కళాశాలలను ఎస్మా చట్టం పరిధిలోకి తెచ్చారు. ఫలితంగా అన్ని ఆసుపత్రులు విధిగా కరోనా రోగులను పరీక్షించి, అడ్మిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక, రిటైర్డ్ వైద్యులను కూడా ప్రభుత్వం మరోసారి కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకునేందుకు కూడా సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన మర్కజ్‌తో సంబంధాలు ఉన్న వారిని యుద్ధ ప్రాతిపదికన గుర్తించడంతోపాటు వారికి కరోనా టెస్టులు చేయాలన్న జగన్ వ్యూహం ఫలిస్తే.. అతి త్వరలోనే ఏపీలో కరోనా విజృంభణకు బ్రేకు పడుతుందని అంటున్నారు వైద్య వర్గాలకు చెందిన నిపుణులు.