ఏపీ రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన 21వ రోజుకు చేరుకుంది. నిరసనల్లో భాగంగా ఈ రోజు జాతీయ రహదారులు దిగ్బంధించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఏపీ రాజధాని విశాఖకు తరలిపోతే ముఖ్యమంత్రి జగన్ నివాసం ఎక్కడుండాలనే అంశాన్ని వైసీపీకి చెందిన కొందరు ముఖ్యనేతలు పరిశీలిస్తున్నారు. జగన్ శాశ్వత నివాసం కోసం భీమిలి, కాపులుప్పాడ, తిమ్మాపురం, మధురవాడ, రుషికొండ ప్రాంతాల్లో స్థలాల కోసం అన్వేషిస్తున్నారు.
నగర శివారులోని ఏదైనా కొండపై నివాసం ఉంటే సహజసిద్ధమైన భద్రత ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు, ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో సీఎం కొన్ని నెలల పాటు అద్దె ప్రాతిపదికన ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా బీచ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఓ స్టార్ హోటల్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు సమాచారం. ఇంకోవైపు, భీమిలి-విశాఖ మార్గంలో ఓ విద్యాసంస్థకు కొన్ని భవనాలు ఉన్నాయి. వీటిని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.